బాహుబలి పుణ్యమాని ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, క్యారెక్టర్ల పోస్టర్లు, ట్రైలర్లు, ఇలా చిన్న సినిమాల దగ్గరి నుంచి బడా సినిమాలు కూడా ఫాలో అయిపోతున్నాయి. నిజానికి అసలు ఈ ఫస్ట్ లుక్ ఐడియాను జక్కన్న కన్నా ముందే పరిచయం చేసింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైంలో క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ను వదిలాడు. కానీ, ఆ ఐడియా పెద్దగా పేలలేదు. బాహుబలి విషయంలో మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. అప్పటి నుంచి చిన్న చితకా సినిమాలు కూడా ఇదే రూట్ లో వెళ్తున్నాయి.
ఇక అసలు విషయానికొస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘సరైనోడు’ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. భారీ రెస్పాన్స్ తో ఇప్పటిదాకా 1,106,867 మంది వీక్షించారు. తాజాగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో టీజర్ 36 గంటల్లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు దానిని బ్రేక్ చేస్తూ కేవలం 34 గంటల్లో సరైనోడు 1 మిలియన్ మార్క్ ని దాటి సరికొత్త రికార్డ్ సృష్టించింది. విజిల్స్ వేయిస్తున్న 30 సెకన్ల టీజర్ లో ఊర మాస్ బన్నీని చూపించాడు బోయపాటి. స్టైలిష్, మాసివ్ లుక్ బన్నీ లుక్ వుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. మార్చిలో ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ లో చిత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు.