సింహాసనం... తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి సినిమా స్కోప్ చిత్రాన్ని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన 235వ చిత్రం ఇది. అంతేకాదు, తెలుగులో 70 ఎంఎం, స్టీరియో ఫోనిక్ సౌండ్ ఎఫెక్టుతో వచ్చిన తొలి చిత్రం. ఈ సినిమా 1986 మార్చి 21న విడుదలైంది. అంటే, నేటికి సరిగ్గా 30 సంవత్సరాల క్రితం థియేటర్లను తాకింది. అఖండ విజయాన్ని సాధించిన సింహాసనం చిత్రం గురించి నేటి తరం ప్రేక్షకుల కోసం కొన్ని విశేషాలు...
తొలి తెలుగు కౌబాయ్ చిత్రాన్ని 'మోసగాళ్లకు మోసగాడు' రూపంలో, తొలి సినిమా స్కోప్ చిత్రాన్ని 'అల్లూరి సీతారామరాజు' రూపంలో అందించిన కృష్ణ మనసులో ఓ జానపద చిత్రాన్ని అందించాలన్న కోరిక నుంచి పుట్టిందే ఈ సింహాసనం. దీన్ని కూడా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించడం ఆయన డేరింగ్ కు నిదర్శనం. చిత్రంలో హీరోలుగా ద్విపాత్రాభినయం చేస్తూ, దర్శకత్వ బాధ్యతలు సైతం చేపట్టిన కృష్ణ, చిత్ర నిర్మాణానికి తీసుకున్న సమయం కేవలం 53 రోజులు మాత్రమే.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మైలురాయిలా చిత్రాన్ని నిలపాలన్న ఆయన కోరికకు, సోదరుడు ఆదిశేషగిరిరావు ప్లానింగ్ తోడు కావడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. ఆ రోజుల్లో ఖర్చుకు ఎంతమాత్రమూ వెనుకాడకుండా దాదాపు రూ. 50 లక్షలు పెట్టి సినిమా తీశారు. అదే చిత్రాన్ని నేడు నిర్మించాలంటే కనీసం రూ. 100 కోట్లవుతుందని అంచనా. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధికంగా 157 ప్రింట్లతో విడుదలైన చిత్రం కూడా సింహాసనమే కావడం గమనార్హం.
ఇక ఈ సినిమా కథ చరిత్రలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని త్రిపురనేని మహారథి తయారు చేశారు. రుద్రమదేవి స్ఫూర్తితో అలకనందాదేవి (జయప్రద) పాత్రను, గోన గన్నారెడ్డి స్ఫూర్తితో విక్రమసింహ సేనాపతి (కృష్ణ) పాత్రను తీర్చిదిద్దారు. కాకతీయుల చరిత్రలో రుద్రమదేవిని గోన గన్నారెడ్డి కాపాడినట్టుగానే, ఈ చిత్రంలో అలకనందా దేవిని విక్రమ సింహ కాపాడతాడు. ఇక మౌర్యుల చరిత్ర నుంచి విషకన్య చందనగంధి (మందాకిని) పాత్రను సృష్టించారు. చంద్రగుప్తుడి మీదకు విషకన్యను ప్రయోగించినట్టుగానే, ఈ చిత్రంలోనూ సీన్స్ కనిపిస్తాయి. ఈ చిత్రంతోనే బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు.
గాయకుడు ఎస్పీ బాలుతో విభేదాలు ఉన్న కారణంగా చిత్రంలోని పాటలన్నీ రాజ్ సీతారామ్ పాడారు. ఆకాశంలో ఒకతారా..., వహవా నీ యవ్వనం... పాటలతో పాటు అలకనందాదేవిని ఆహ్వానిస్తూ, దాదాపు 10 నిమిషాలు సాగే స్వాగత నృత్యం సినిమాకే హైలైట్ గా నిలిచాయి. చిత్రం హిందీ వర్షన్ లో హీరోగా జితేంద్ర నటించారు. ఆరు కేంద్రాల్లో 70 ఎంఎం ప్రింట్లతో చిత్రాన్ని ప్రదర్శించగా, హైదరాబాద్ లోని దేవీ థియేటర్ లో 105 రోజులాడటంతో పాటు మరో ఐదు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తొలి వారంలో రూ. 1.51 కోట్లను వసూలు చేసి అప్పటి వరకూ ఉన్న కలెక్షన్ రికార్డులను తిరగరాసింది.
ఇక సినిమా శతదినోత్సవం మద్రాసు వీజీపీ గార్డెన్స్ లో జరుగగా, అభిమానుల తాకిడితో జయప్రద, రాధ, జితేంద్ర తదితరులు వేదిక వద్దకు సైతం చేరుకోలేని పరిస్థితిలో వెనుదిరగాల్సి వచ్చిందంటే, ఈ సినిమా పట్ల ప్రజలు, కృష్ణ అభిమానుల ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సింహాసనం మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకు, నీహార్ ఆన్ లైన్ అభినందనలు చెబుతోంది.