శ్రీరామ్ లక్ష్మీ రాయ్ లు తమిళంలో ఎక్కువ సినిమాలు చేసినా... శ్రీరామ్ అచ్చ తెలుగు యువకుడు. తెలుగులో ఎందుకో ఇతగాడికి అదృష్టం కలిసి రాలేదు... కానీ తమిళంలో హీరోగా బాగానే రాణించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. తమిళంలో మైనా, సొట్టె వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సోలమ్ స్టూడియోస్ తెలుగు, తమిళ భాషల్లో ‘బేగంపేట' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. హీరో శ్రీరామ్, లక్ష్మీ రాయ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్ విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర దర్శకుడు వడిపుడయాన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఈ చిత్రం కోసం హైదరాబాద్ పంజాగుట్టలోని స్మశాన వాటికలో ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ సారథ్యంలో హీరో హీరోయిన్లు శ్రీరామ్, లక్ష్మీరాయ్ లు 50 ప్రేతాత్మలతో తలపడే దృశ్యాలను వరుసగా పది రోజులు రాత్రిపూట చిత్రీకరించాం. దీంతో పాటు మరో పది రోజులు హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో మరి కొన్ని దృశ్యాలు తీశాం. హైదరాబాద్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది’’ అన్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేయనున్నట్టు తెలిపారు.