మరో హాస్యనటుడి హఠాన్మరణం తెలుగు పరిశ్రమను దిగ్ర్భాంతికి గురిచేసింది. ‘అయితే ఓకే’ అనే డైలాగుతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటుసంపాదించుకున్న ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. కొంతకాలంగా ఆయన హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు.
కొండవలస ఆగస్టు 10, 1946లో శ్రీకాకుళం జిల్లా కొండవలసలో జన్మించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు'తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో తాను పండించిన హాస్యంతో టాప్ కమెడియన్‌గా మారిపోయారు. అప్పటి నుంచి సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు లో ఉద్యోగం చేస్తూ... వెయ్యికి పైగా నాటకాలు వేసిన కొండవలస తనదైన శైలితో ప్రేక్షకుల్ని మెప్పించారు.అంతేకాదు నాటిక రంగంలో రెండు నంది అవార్డులను కూడా దక్కించుకున్నారు. 'ఇండియన్ గ్యాస్' అనే నాటికలో తన శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు పలికారు. ఆ విధానం అప్పట్లో అందరికీ నచ్చింది. అదే తీరును ఆయన సినిమాల్లో తన పాత్రలకు అన్వయించుకుని ఆపై సినీ రంగంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కబడ్డీ కబడ్డీ, ఒట్టేసి చెబుతున్నా, దొంగరాముడు అండ్ పార్టీ, సత్యం, కాంచనమాల కేబుల్ టీవీ, ఎవడిగోల వాడిదే, బ్లేడు బాబ్జీ, బెండు అప్పారావు ఆర్.ఎం.పీ, సరదాగా కాసేపు, అదుర్స్, కత్తి కాంతారావు.. చిత్రాలతో హాస్యనటుడిగా బాగా పేరు తెచ్చుకున్నారు.
పదిమందినీ కడుపుబ్బా నవ్వించి, ప్రేక్షకులకు కొండంత ఆనందాన్ని పంచిన కొండవలస లేరని విషయాన్ని తెలుగు సినీపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మృతికి పలువురు సినీ పెద్దలు సంతాపాన్ని ప్రకటించారు. కొండవలస ఆత్మకు శాంతి చేకూరాలని కొరుకుంటూ నీహార్ ఆన్ లైన్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది.