గుణ శేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేసింది బాల రామాయణంలోనే, ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలన్న గుణ శేఖర్ కోరిక ఇంత వరకూ నెరవేరనే లేదు. గోన గన్నారెడ్డి పాత్ర ను ఎన్టీఆర్ తో చేయించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర చేయలేకపోయాడు. ఇప్పుడు గుణశేఖర్ ఎన్టీఆర్ తో ఓ హిస్టారికల్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. గుణశేఖర్ త్వరలో తెరకెక్కించబోయే ప్రాజెక్టులో మహాభారతంలో ఎంతో కీలకమైన ‘అభిమన్యు' పాత్రను ఎన్టీఆర్‌ను ఎంపిక చేస్తున్నట్లు టాక్. ఇటీవల గుణశేఖర్ ‘వీరాభిమన్యు' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీంతో మహాభారతంలో అభిమన్యుడు చేసిన వీరోచిత పోరాటం నేపథ్యంలో గుణశేఖర్ సినిమా తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకు కేవలం జూ ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని గుణశేఖర్ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. రుద్రమదేవి తర్వాత 'ప్రతాపరుద్రుడు' తీస్తానని ప్రకటించిన గుణశేఖర్ అందుకు తగ్గట్లుగా 'రుద్రమదేవి' ఎండింగ్‌లో టైటిల్ కార్డ్ కూడా వేశాడు. ఇటీవల సక్సెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'ప్రతాపరుద్రుడు' మూవీ తను నిర్మిస్తానని కూడా ప్రకటించాడు. అయితే ఇంతలోనే గుణ టీమ్ వర్క్స్ పతాకం పై 'వీరాభిమన్యు' అనే టైటిల్ రిజిస్టర్ చేయడం ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.