మనదేశంలో టాలీవుడ్ కి ప్రత్యేకత ఉంది. మార్కెట్ పరంగా అగ్రతాంబులం బాలీవుడ్ దే అయినప్పటికీ, చిత్ర నిర్మాణ సంఖ్యాపరంగా తెలుగు సినిమాయే ప్రతియేడు ముందుంటుంది. ప్రతీ ఏడాదీ వేలకోట్ల రూపాయల పెట్టుబడి టాలీవుడ్ లోకి ప్రవాహంలా వస్తుంది. అలాగే వేలాది కుటుంబాలు తెలుగు సినీ కళామ తల్లిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాయి. అందుకే, ఈ వినోద పరిశ్రమ దేశంలో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక ప్రతి యేడులాగానే 2014 సంవత్సరం టాలీవుడ్ క్యాలెండర్ తన ప్రాముఖ్యతను నిలబెట్టుకుంది. మొత్తం 193 స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు, 82 అనావద చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. హిట్లు, ఫట్లు, యావరేజ్ లు తమ తమ మార్క్ ను నిలబెట్టుకున్నాయి. హిట్ల గురించి చెప్పాలంటే ఈ వరుసలో ముందుండి మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది మాత్రం ఒక్క ‘రేసు గుర్రం’ మాత్రమే. టామ్ అండ్ జెర్రీ తరహాలో కథాకథనం పరమ రోటీన్ దే అయినప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ బేస్డ్ గా వచ్చిన చిత్రం కావడం, ఆ సమయంలో పోటీ చిత్రాలు కూడా ఏం లేకపోవటంతో రేసు గుర్రం రికార్డు కలెక్షన్లను ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ తోపాటు టాలీవుడ్ టాప్-5 లో నిలిచింది. అంతేకాదు టాప్ హీరోల రేసులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చోటు కల్పించింది. దీని తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం బాల కృష్ణ లెజెండ్ చిత్రం. బోయపాటి దర్శకత్వంలో నటసింహ బాల కృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య రాజకీయ ఆరంగ్రేటానికి సహకరించిందన్నది అక్షర సత్యం. కలెక్షన్లలో కూడా 50 కోట్లు వసూలు చేసి ఈ యేడు రెండో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. కమర్షియల్ చిత్రాలు టాలీవుడ్ ను శాసిస్తున్న టైంలో తెలుగు ప్రేక్షకులకు కొత్త దనాన్ని రుచి చూపించిన చిత్రం మనం. అక్కినేని కుటుంబం నటించిన ఈ చిత్రం అన్నివర్గాల ఆదరణకు నోచుకొని ఈ సంవత్సరం వచ్చిన చిత్రాలలో బెస్ట్ చిత్రంగా నిలిచింది. పునర్జన్మల నేపథ్యంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు ఆఖరి చిత్రంగా వచ్చిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీతోపాటు ఆడియోన్స్ కు కూడా స్పెషలే. ఇక వంశీపైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు చిత్రం కూడా హిట్ గా నిలివగా, కృ ష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ యావరేజ్ గా నిలిచింది. ఇక వరుస ఫ్లాపులతో ఢీలాగా ఉన్న సీనియర్ నటుడు వెంకటేష్ కి ఈ యేడు కలిసోచ్చింది. దృశ్యం లాంటి ఫ్యామిలీ చిత్రంతో వెంకీ హిట్ సాధించాడు. అలాగే మాస్ రాజా రవితేజ నటించిన పవర్ చిత్రం కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. గొపిచంద్ లౌక్యం, నాగచైతన్య ఒక లైలా కోసం, అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, శర్వానంద్ కి రన్ రాజా రన్, నితిన్ కి హార్ట్ అటాక్, నిఖిల్ కార్తికేయా, నారా రోహిత్ రౌడీ ఫెల్లో, అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి, సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, మంచు ఫ్యామిలీ పాండవులు పాండవులు తుమ్మెద, సుమంత్ అశ్విన్ లవర్స్ , విభిన్న కథాంశాలతో వచ్చిన నాగ శౌర్య రెండు చిత్రాలు ఊహాలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా చిత్రాలు తమ తమ స్థాయి హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం రీసెంట్ గా విడుదలైన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన ముకుంద, నితిన్ చిన్నదాన నీకోసం ఓ మాదిరి కలెక్షన్లతో నడుస్తున్నాయి.