బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే టైంలో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు వరుసగా వచ్చి బ్లాక్ బస్టర్ లు అవుతున్నాయి. చక్ దే ఇండియా, లగాన్, బయోపిక్ లు గా వచ్చిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ లు ఏ రేంజ్ విజయాలు సొంత చేసుకున్నాయో తెలిసిన విషయమే. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ ధోనీ, మరో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్రలపై సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ జీవితచరిత్ర ఆధారంగా కూడా చిత్రం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై విశ్వనాథన్ ఆనంద్ స్పందిస్తూ... ఒకవేళ నా జీవితచరిత్రను తీస్తే చాలా మంచింది. కానీ నా పాత్రను బాలీవుడ్ నటుడు అమీర్ ఖానే చేయాలని కొరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేస్తేనే నా పాత్ర బాగా వస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఇందుకు మరో కారణం కూడా ఆయన చెప్పారు. అమీర్ చెస్ బాగా ఆడతారని, ఒకసారి ఓ గేమ్ లో తనకు చెమటలు పోయించాడని చెప్పుకొచ్చాడు. ఇక అమీర్ కూడా అవకాశం వస్తే ఆనంద్ జీవిత కథలో నటించేందుకు సిద్ధమని ఓసారి ప్రకటించాడు కూడా.
ఇదిలాఉంటే అమీర్ ప్రస్తుతం రెజ్లింగ్ క్రీడపై తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘డంగల్’ చిత్రంలో నిజజీవితంలో ప్రసిద్ధ మల్లయోధుడైన ‘మహావీర్ ఫోగత్’ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ భారతీయ మహిళా మల్లయోధులైన గీతా, బబితా కుమారి ఫోగత్‌ల తండ్రి మహావీర్. కుమార్తెలిద్దరినీ మల్లయుద్ధంలో ప్రోత్సహించిన ఆ తండ్రి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందట. అంటే అన్ని కుదిరితే ఆనంద్ పాత్రలో అమీర్ ను కూడా త్వరలో చూడబోతున్నామన్న మాట.