ఆ ఇద్దరితో అనుబంధం...

December 24, 2014 | 02:15 PM | 24 Views
ప్రింట్ కామెంట్

ఆయన సినిమాలు కల్పితాలనిపించవు. మనింట్లోనో, పక్కింట్లోనే జరుగుతున్న సమస్యలుగా, కథలుగా అనిపిస్తాయి. మధ్య తరగతి మనుషుల మనోభావాలు.... సంఘర్షణలు... సజీవంగా ఆయన ప్రతి చిత్రంలోనూ కనిపిస్తాయి. అందుకే ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, ఏఎన్నార్ వంటి జాతీయ గౌరవాలు వరించాయి. ముఖ్యంగా బాలచందర్ సినిమాల గురించి తలుచుకుంటే గుర్తుకు వచ్చే ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్. బాలచందర్ –ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ చిత్రమూ ఓ కళాఖండమే. ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంది. అంత అర్థవంతమైన సినిమాలు వీరివి. నటుడు రజనీకాంత్ ఇప్పటికీ షాక్ లోనే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన లోటు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా పూడ్చలేనిదని రజనీకాంత్ అన్నారు. ఆయన తనకు గురువు మాత్రమే కాదనీ, తండ్రిలాంటి వారని, సొంత బిడ్డలా చూసేవారని చెప్పుకున్నారు. 1975లో 'అపూర్వ రాగంగల్' చిత్రం ద్వారా రజనీకాంత్ ను బాలచందర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొదటి చిత్రం నుంచి నిన్నటి వరకూ అంటే 40 ఏళ్ళ అనుబంధం వీరిది. అలాగే కొనసాగుతూ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో పది చిత్రాలు వచ్చాయి. మరో కథానాయకుడు కమల్ ని పరిచయం చేసింది కూడా ఈయనే. ఈయన కూడా అపూర్వ రాగంగల్ లో ఒక చిన్న పాత్రలో నటించాడు. ఈ ఇద్దరు నటులూ ఆ దర్శకుడి వల్లే తాము ఇంత వారమయ్యామని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పు కున్నారు. కానీ వీరిద్దరి గురించీ బాలచందర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ‘వారిని నేను పరిచయం మాత్రమే చేశాను. ఇద్దరికీ కష్టపడే, నేర్చుకునే తత్వం ఉన్నాయి, కమల్ ప్రతిదీ చూసి, గమనించి, తెలుసుకుని తనకు తానుగా పైకి వచ్చాడు, రజనీకి మాత్రం ముందే టాలెంట్ ఉంది. దాన్ని నేను కేవలం ప్రపంచానికి పరిచయం మాత్రమే చేశాను’ అని అన్నారు. ప్రస్తుతం కమల్ ఉత్తమ విలన్ చిత్రానికి సంబంధించిన వర్కులో లాస్ ఏంజిల్స్ లో ఉన్నారు. ఈ వార్తతో ఆయన కూడా షాక్ కు గురై హుటాహుటిన ఇండియాకు బయలుదేరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ