టాలీవుడ్ లో టాప్ చెయిర్ కోసం పోటీపడే స్టార్లు ఎవరంటే ప్రస్తుతానికి వినిపించే పేర్లు రెండే. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరోకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇద్దరు ఎవరికి వారే అన్నట్టు ఫ్యాన్స్ క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. అయితే పబ్లిసిటీలో పవన్ కంటే మహేష్ చాలా ముందుండనే చెప్పుకోవాలి. ఇండియా మోస్ట్ డిజైరబుల్ పర్సన్, గూగుల్ మోస్ట్ సెర్చ్ డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన మహేష్ తన ప్రత్యేకత ఏంటో చెప్పకనే చెప్పాడు. అలాంటి మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయబోయే చిత్రం బ్రహ్మోత్సవం (టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది)కి గానూ అక్షరాల 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం. పీవీపీ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం నిర్మాత మహేష్ కు ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడంట. ఈ యేడాది వచ్చిన వన్-నేనోక్కడినే, ఆగడు చిత్రాలకు మహేష్ సుమారు 14 నుంచి 16 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. మరీ ఆ చిత్ర ఫలితాలను చూసిన తర్వాత కూడా నిర్మాతలు మహేష్ కు ఇంత భారీ పారితోషకాన్ని ఇవ్వచూస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క మహేష్ కే 25 కోట్లు ఇస్తున్నారంటే ఈ చిత్రం మినిమమ్ 70 కోట్ల బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ చిత్రం వందకోట్లు వసూలు చేయాల్సిందే కదా. మరోవైపు ఇదంతా జోక్ కాదు కదా అని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.