‘మంత్ర 2’ విడుదల కూడా గుట్టు చప్పుడు కాకుండా చేశారు. అంతకు ముందు జ్యోతి లక్ష్మికి వీర లెవల్లో పబ్లిసిటీ చేసుకున్న ఛార్మి ఇందులో హీరోయిన్ అయినప్పటికీ ఒక్క ఇంటర్వ్యూ కానీ, ప్రెస్ మీట్ కానీ, ప్రమోషన్ టూర్ గానీ చేయలేదు. అలా ఎందుకో ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం. కానీ ఈ సినిమాలో నటించిన చేతన్ మాత్రం అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఒక్కడే పబ్లిసిటీ చేసుకుంటూ కనిపిస్తున్నాడు. జనాల్లోకి వెళ్ళేలా చూస్తున్నాడు. 'అంజలి' చిత్రంలో బాలనటుడిగా నటించిన చేతన్ చీను ఇటీవల విడుదలైన 'మంత్ర 2' ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం స్వయంగా కొన్ని జిల్లాల్లో తిరుగుతున్నాడు. తన స్వస్థలం అమలాపురం వెళ్లి అక్కడివాళ్లతో సందడి చేశారు. ఇక, ప్రేక్షకుల దగ్గరికెళ్లినప్పుడు వాళ్లు స్పందించిన వైనాన్ని చేతన్ మాటల్లోనే విందాం.. "ఈ పర్యటన నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వెళ్లిన పత్రి చోటా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు'' అని చేతన్ చెబుతూ - "తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించాను. రాజమండ్రిలోని అశోక మహల్ థియేటర్, యానాంలోని పద్మజ థియేటర్, కాకినాడ సంగీత్ థియేటర్లకు వెళ్లాను. బాగా యాక్ట్ చేశారని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందం అనిపించింది. ఇక, అంబాజీపేట నుంచి అమలాపురం వరకు 200 నుంచి 300 బైక్స్, 50 కార్లతో ప్రేక్షకులు ర్యాలీగా వచ్చిన వైనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అదే విధంగా అమలాపురంలో మెయిన్ రోడ్ సెంటర్ నుంచి థియేటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు పదిహేను మంది వేదపండితులు పూర్ణ కుంబంతో స్వాగతం పలకడం ఓ మర్చిపోలేని అనుభూతి. మర్నాడు రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణగారు నన్ను ఎస్.కె.వి.టి. కాలేజీలో వేలమంది స్టూడెంట్స్ మధ్య సత్కరించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇలా ఒక్కణ్ణే సినిమా ప్రచార బాధ్యతను తీసుకోవడం కరెక్టో తప్పో నాకు తెలియదు కానీ, నేను నటించిన సినిమా నిలబడాలనే సదుద్దేశంతోనే ఈ పర్యటన చేశాను. '' అన్నాడు.