మా ఎలక్షన్ల వివాదాలు నెమ్మదిగా తారా స్థాయినందుకుంటున్నాయి. ఇవి వాయిదా పడతాయేమో అనుకునేలా వివాదాలు చెలరేగుతున్నాయి. ఆదివారం జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలు కాన్సిల్ ఖాయమంటున్నారు సినీ పరిశ్రమ ప్రముఖులు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కళ్యాణ్ అనే నటుడు, ఎన్నికల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని పిటిషన్ వేశాడు. నామినేషన్లు స్వీకరించడానికి నిబంధనలు పాటించలేదని, సమయం దాటిపోయిన తర్వాత కూడా నామినేషన్లు తీసుకున్నారని, అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జయసుధ పరిమిత సమయంలో నామినేషన్ వేయలేదని అంతే కాకుండా ఇతర అనేక అంశాలను ఈ పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన కోర్టు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్, నటుడు అలీకి నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది. కోర్టు తీర్పును బట్టి తరువాత ఏం చేయాలనే దానిపై కూడా ఇరు వర్గాలు తీవ్రమైన చర్చల్లో మునిగి తేలుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సినీ వర్గంలో ఇలా రెండు గ్రూపులు ఏర్పడ్డం, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకోవడంతో ఇప్పుడు సినిమాలు కూడా గ్రూపులుగా తయారై తీస్తారేమో అని సామాన్యులు అనుకుంటున్నారు.