గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో, క్రికెట్ అభిమానులు ఉరుం ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనుష్క శర్మ మీద పడుతున్నారు. విరాట్ సరిగా ఆడకపోవడానికి కారణం ఆమేనంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు తన మనసులో ఉన్న భావాన్ని బయట పెట్టడానికి సోషల్ నెట్వర్క్ బాగా ఉపయోగపడుతుంది కదా.. ఆమె మీద చాలా మందే విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో నటుడు కమాల్ ఆర్ ఖాన్ జనాలను రెచ్చగొట్టే విధంగా తన భావాన్ని వ్యక్తపరిచాడు. ‘అనుష్క శర్మ ఇంటిపైన రాళ్లు వేయండి, తన సినిమాలను బహిష్కరించండి. ఇండియా మ్యాచ్ గెలవకపోవటానికి కారణం అనుష్క శర్మే. ఆమె సినిమాలను ఎవరైతే చూస్తారో వారు దేశ ద్రోహులు’ అంటూ పోస్టు చేశాడు. అలాగే అనష్క శర్మ టీమ్ నంతటినీ వెనక్కి తీసుకురావటానికి వెళ్లిందంటూ ఒక ఫొటో ని సైతం పోస్ట్ చేసాడు. అయితే ఇలా అనుష్కను ఆడిపోసుకున్న వారిని తప్పుబడుతూ అనుష్కకు మద్దతు పలికిన వారిలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. క్రికెట్ చూడ్డానికి క్రికెట్ ప్లేయర్ల కుటుంబ సభ్యులు చాలా మందే వస్తారు. వాళ్ళు ఆడకపోయినంత మాత్రాన తప్పు చూసిన వాళ్ళది ఎలా అవుతుంది. మానసిక పరిపక్వత లేని వాళ్ళు చేసే కామెంట్లు ఇలాగే ఉంటాయని అంటున్నాడు.