విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో డాక్టర్ మోహన్ బాబు ఒకరు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి, నా రూటే సపరేటూ అంటూ దానిని రక్తి కట్టించగల నటుడు ఆయన. దర్శకరత్న దాసరి దర్శకత్వంలో స్వర్గం-నరకంతో(1975) మొదలైన ఆయన నటనా ప్రయాణం నలభై ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన ఆత్మకథను రాయబోతున్నారట. నలభై ఏళ్ల తన నటనా జీవితంలో ఎదురైన అనుభవాలు, జ్నాపకాలు తదితర విషయాలన్నింటినీ పుస్తకంగా ఆయన తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న. పుస్తకం ద్వారా ఆయన ఏం చెప్పదల్చుకున్నారనేది?
తరచూ వివాదాలకు దారితీసే ఆయన మాటలు ఇప్పుడు పుస్తకరూపంలో ప్రచురితమైతే ఎలా ఉంటుందనేది ఇఫ్పుడు చర్చనీయాంశమౌతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఓ వర్గానికి పొసగదనేది బహిరంగంగానే తెలిసింది. తమ మధ్య ఏం లేదు లేదు అంటూనే ఆయన వారిపై ఎప్పుడూ విరుచుకుపడుతుంటాడు. అంతేకాదు కొన్నిసార్లు వారి సమక్షంలోనే వారిపైనే సెటైర్లు వేసి ఆనందించటం ఆయన ప్రత్యేకత. దీంతో పుస్తకంలో ముఖ్యంగా వారి గురించి ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డైలాగ్ కింగ్ ఆత్మకథలో ఎన్ని సంచలన విషయాలు ఉంటాయోనని సినీ పండితులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ పుస్తకం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని అంటున్నారు. డింగ్.డింగ్..డింగో...డింగూ... ఎంటర్ టైన్ మెంట్ కి రెడీ అయిపోవటమే తరువాయి.