తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్లు తగ్గినప్పటికీ సినిమాలు తీయాలనే అభిరుచి మాత్రం బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగు పరిశ్రమ మరో భారీ చారిత్రాత్మక చిత్రానికి సన్నాహాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చాలాకాలం తర్వాత అనుష్క టైటిల్ రోల్లో నటించిన ‘రుద్రమదేవి’ విడుదలకు సిద్ధమవుతుంటే, శ్రీకృష్ణదేవరాయలు కథాంశంతో త్వరలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. ఈ న్యూస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రకటించడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని ప్రకటిస్తూనే, తన గురువు రాఘవేంద్రరావు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ టైటిల్ రోల్లో భారీ ఎత్తున నిర్మించే ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అయతే, ఈ సినిమా బాలకృష్ణ 100వ చిత్రం తర్వాతే నని తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణ ‘శ్రీకృష్ణదేవరాయలు’ గెటప్ లో ‘ఆదిత్య 369’లో కనిపించారు. ఇదే కథాంశంతో 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ సినిమా టైటిల్ రోల్ ను మాత్రం అక్కినేని పోషిస్తే, శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించారు. పౌరాణిక చిత్రాల్లో రాజులు, భక్తి చిత్రాల్లో దేవుళ్ళ పాత్రలకు ఎన్టీఆర్ నప్పినంతగా ఏ నటుడూ ఉండడమో అన్నంత బాగుంటాడు ఎన్టీఆర్. రాయలుగా కూడా నిజమైన రాయలు ఇలానే ఉంటాడేమో అనుకోవచ్చు. అయితే పూర్తిగా దేవరాయలు కథతో ఇప్పటివరకూ సినిమా రాకపోవడంతో ఆ కథతో సినిమా తీయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.