తమిళనాట మూవీ అసోషియేషన్ ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి. బరిలో పోటీకి దిగుతున్న యువనటుడు విశాల్, ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నదిగర్ సంగమ్ (తమిళనాడు మూవీ అసోషియేషన్) కు సంబంధించిన భూములను శరత్ కుమార్ అక్రమంగా అమ్ముకున్నారని నటుడు విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇద్దరి మధ్య ఏడాది కాలంగా వార్ జరుగుతూనే ఉంది. అంతేకాదు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఈ మధ్య ఓ టీవీ చానెల్ లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. దీనిపై శరత్ కుమార్ పరువు నష్టం దావా కేసు వేశాడు. కేసుపై విశాల్ స్పందిస్తూ... జరగబోయే దాని గురించి నేను ఆలోచించను. నా దగ్గర ఆధారాలున్నాయని చెప్పినా ఆయన పరువు నష్టం కేసు వెయ్యటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజాలు మాట్లాడితే ఆయనకు మండినట్లుంది. అక్రమాలకు సంబంధించిన పేపర్లు నా దగ్గర ఉన్నాయి. వాటిని మీడియా ముందేగా బయటపెట్టింది అంటూ ఘాటుగా స్పందించాడు. అసలు ఆయన అధ్యక్షుడు అయిన తర్వాతే అక్రమాలు ఎక్కువయ్యాయంటూ విశాల్ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం ఎన్నికల్లో యువ రక్తం గెలవాలని ప్రతీ ఒక్కరూ కొరుకుంటున్నారు. మార్పు సాధ్యమయ్యేది కూడా మాతోనే అని చెప్పాడు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి రప్పించటమే మా లక్ష్యం అని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య వాడీవేడీ విమర్శలతో నదిగర్ సంగంకి ఎన్నికలు అక్టోబర్ 18న జరగనున్నాయి.