బిజెపి ఎంపి, ప్రముఖ సినీ నటి హేమమాలిని రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు కనుబొమలు, ముక్కు వద్ద, వీపు మెడపైన తీవ్ర గాయాలయ్యాయి. హేమామాలిని కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతిచెందింది. రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె నియోజకవర్గం మథుర నుంచి రాజస్థాన్ రాజధాని జయపురకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గురువారం రాత్రి 8.50 గంటలకు జయపురకు 60కి.మీ దూరంలోని దౌసా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు మారుతి ఆల్టోను ఢీకొంది. ఈ వేగానికి రెండు కార్లు బోల్తా పడ్డట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆల్టో కారులో డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ప్రయాణిస్తున్నారని దౌసా కలెక్టర్ స్వరూప్ పన్వర్ తెలిపారు. ఆల్టోలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి సోనమ్ చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో హేమామాలినికి కూడా బాగా రక్తంశ్రావం జరిగింది. వెంటనే జయపురలోని ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించి నుదుటి భాగంలో కుట్లు వేసి, ప్రథమ చికిత్స జరిపారు.
రాజస్థాన్ పోలీసులు వెంటనే ఎలర్టై ఆ కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఏ విధమైన అనవసరమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఎంపీ కారు డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.