అప్పటికీ చేసింది ఒక్క సినిమానే, అదీ ఓ లవ్ స్టోరీ. అయినా నమ్మకంతో ఇద్దరు అగ్ర హీరోలు ఆ దర్శకుడితో సినిమాకు ముందుకు వచ్చారు. సీన్ కట్ చేస్తే దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ముందుకోచ్చిన ఓ మల్టీస్టారర్ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకెళ్లి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకుంది. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ ఆప్యాయతల నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. అగ్రహీరోలన్న భేదాలను పక్కన బెట్టి మరీ మహేష్, వెంకటేష్ చేసిన నటన ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇప్పుడు ఇదే తరహాలో మరోక మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించి తీరుతానని శ్రీకాంత్ అడ్డాల ప్రకటించాడు. ఇటీవల ముకుందతో మరో హిట్ ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టు మాత్రం మళ్లీ మహేష్ తోనే కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే వేసవి నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రం తరువాత మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తానని, ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటించబోయే హీరోల విషయం మాత్రం ఆయన లీక్ చేయలేదు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన ఒక హీరో నటిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం 2016 లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.