మొదటి సినిమాలోనే బికినీ వేసి తన అందంతో ఆకట్టుకుంది మహేష్ భట్ తనయ అలియా భట్. అవసరమైతే ఎంతదాకా అయిన వెళ్తానని అప్పుడే ప్రకటించేసింది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ కథానాయికలలో అలియాకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రీసెంట్ కపూర్ అండ్ సన్స్ చిత్రంతో మంచి హిట్ కొట్టి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమైపోతుంది. ఈ నాజూకు సుందరి సినిమాలు చూడటానికి యూత్ యమ ఉత్సాహం చూపించేస్తూ వుంటుంది. అలాంటిది ప్రస్తుతం ఓ దర్శకుడిని ఒకటే పోగిడేసేస్తోందట. ఆ దర్శకుడు ఎవరో కాదు 'వేక్ అప్ సిద్', 'యే జావనీ హై దివానీ' చిత్రాలను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న ఒక సినిమాలో, కథానాయికగా అలియా భట్ కి అవకాశం దక్కింది. దాంతో అమ్మడి సంతోషం అంతా ఇంతా కాదు.
అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిభావంతుడనీ .. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలే అందుకు నిదర్శనమని ఆమె చెబుతోంది. ఆయన దర్శకత్వంలో నటించనుండటం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అంటోంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది. సూపర్ హీరో నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తొలిసారిగా అలియా రణబీర్ కపూర్ సరసన నటించనుంది. ఇక ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.