అంతే మరి రజనీ కాంత్ సినిమా వస్తుందంటే మిగతా చిత్రాలన్నీ బరిలోంచి తప్పుకోవల్సిందే. తమిళ్ తో తెలుగు చిత్రాలు కూడా తలైవాతో పోటీకి దిగలేమని ముందుకెళ్తున్నాయి. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన డజన్ల కొద్ది చిత్రాలు లింగా దాటికి నిలవలేమంటూ పోటీ నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే 150 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా 40 ఏళ్ల సినీ చరిత్రలో రజనీ బర్త్ డే సందర్భంగా విడుదల అవుతున్న చిత్రం కావడంతో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లింగా కలెక్షన్ల సునామీలో కొట్టుక పోవడం ఖాయమనుకున్న చాలా చిత్రాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇక ఈ వరుసలో తెలుగు చిత్రాలైన చిన్నదాన నీకోసం, ముకుందా కూడా ఉన్నాయి. తెలుగు పెద్ద చిత్రాలకు పోటీ ఇవ్వగల సత్తా ఉన్న ఏకైక నటుడు రజనీ కావడంతో ఆయా చిత్రాలు విడుదలకు జడుస్తున్నాయి. ఏకంగా రెండు వారాలు తమ చిత్రాల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుని క్రిస్మస్ కానుకగా రానున్నాయి. ఇక ఈ శుక్రవారం అయితే చిన్నా చితకవి కలుపుకొని ఏకంగా 13 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత వచ్చే ఈ సింహం సింగల్ గా వచ్చి రెండు వారాల కలెక్షన్లను ఆరగించటం ఖాయం.