ఇప్పుడు హిందీ చిత్రసీమలో ఎక్కడ చూసినా ‘షమితాబ్’ చిత్రం గురించే వినిపిస్తోంది. ఇటీవల విడుదలయిన ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రెక్కెత్తిస్తోంది. బిగ్ బి - అమితాబ్ బచ్చన్, తమిళ హీరో ధనుష్, కమలహాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ (తొలి పరిచయం) కలసి నటిస్తున్న చిత్రమిది. అమితాబ్ లు పోటాపోటీపడి నటించినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ, దర్శక, నిర్మాతలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ ఓ విశేషం ఇప్పుడు బయటకి వచ్చిందండోయ్. చాలా కాలం తరువాత అమితాబ్, ఆయన నిజజీవిత మాజీ ప్రేయసి రేఖ కలసి ఈ చిత్రంలో నటిస్తున్నారట. అయితే, ఈ చిత్రంలో వారిద్దరూ కలసి ఏకకాలంలో తెరపై కనిపించరట. ‘అది చిత్రంలో చూసి తెలుసుకోవల్సిందే అని స్వయంగా బిగ్ బీ’ నే ప్రకటించాడు. వారిద్దరి లవ్ స్టోరీ గురించి తెలియని వారుండరు. ప్రేమ విఫలమయినప్పటి నుంచి వారిద్దరు ఎప్పుడూ కలిసి నటించలేదు. అయితే ‘‘ఆసక్తికరమైన స్క్రిప్టు వస్తే - భవిష్యత్తులో కూడా రేఖతో కలసి నటిస్తా’’ అని అమితాబ్ ప్రకటించారు. ఇక షమితాబ్ కు మరో విశేషం ఉందండోయ్... సుమారు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ‘గెరఫ్తార్’ (1985) చిత్రంలో రజనీకాంత్, కమలహాసన్లతో అమితాబ్ నటించాడు. ఇప్పుడేమో ‘షమితాబ్’ ద్వారా వారి వారసులతో నటించడం విశేషం.