అంజలి కథానాయికగా వచ్చిన 'గీతాంజలి' చిత్రం విపరీతంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి విదితమే. ఇప్పుడు దీనికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు సమాచారం. దీనికి కూడా 'గీతాంజలి' దర్శకుడు రాజ్ కిరణే దర్శకుడైనప్పటికీ, నిర్మాత మాత్రం మారాడు. క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చినబాబు దీనిని నిర్మిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు అంజలి ఈ సీక్వెల్ లో నటించకపోవచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే అంజలినీ ఇంతవరకూ ఈ విషయమై అడగలేదట. వేరే హీరోయిన్ ని అనుకుంటున్నారని కూడా సమాచారం. అయితే ఈ సినిమా కూడా హర్రర్ కామెడీ అనే అనుకుంటున్నారు. అంతేకాదు శ్రీనివాస రెడ్డి కూడా ఈ ప్రాజెక్టులో లేడనుకుంటున్నారు. దీని గురించి నిర్మాత చెబుతూ, "గీతాంజలి చిత్రం నాకెంతో నచ్చి ఆ దర్శకుడు రాజ్ కిరణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను. అయితే, వేరే కథతో కాకుండా 'గీతాంజలి' కథతోనే చేయాలనుకున్నాను. ఈ సీక్వెల్ కి రాజ్ కిరణ్ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ కథానాయిక, కథానాయకుడు ఇందులో నటిస్తారు" అన్నారు. దీనికి వెలిగొండ శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నాడు. రాజ్ కిరణ్ మాత్రం ఈ సీక్వెల్ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. సబ్జెక్టు బాగా వచ్చిందని, మొదటి చిత్రం కన్నా స్క్రిప్టు, స్ర్కీన్ ప్లే బాగా కుదిరాయని అంటున్నారు.