ఇంటర్వ్యూల్లో మాట్లాడే చాలా మంది సినీ స్టార్లు కొన్ని పరిమితులు విధించుకొని దాన్ని దాటి వెళ్ళకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు. తమ ఇమేజ్ కు డామేజ్ కాకూడదని వారి ఉద్దేశం. ఇంటర్వ్యూల్లో ఎన్ని ప్రశ్నలు వేసినా, వారినుంచి కొన్ని సమాధానాలను మాత్రమే రాబడతాం. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా ఉండరు. మనసులో ఉన్నది చాలా సింపుల్ గా బయటపెట్టేస్తుంటారు. తెరమీద పంచ్ డైలాగులు, ఫైట్స్ తో తమ హీరోయిజాన్ని చూపించే హీరోలందరూ తాము తెర వెనుక కూడా ఇదే హీరోయిజంతో ఉంటామనే భ్రమ కలిగించే వారూ ఉన్నారు. కానీ అందుకు విరుద్ధంగా తనకు చాలా భయాలుంటాయని చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. షూటింగ్ లో పాటలకు స్టెప్పులేయాలంటే భయమట, యాక్టింగ్ కు ముందు కూడా భయంగానే ఉంటుందట. అయిపోయిన తరువాత హమ్మయ్య ఈ రోజుకు అయిపోయిందని అనుకుంటాడట. ఇక ఫైటింగ్ సీన్లు చేసే సమయంలోనూ తాను విపరీతంగా భయపడతానని చెబుతూ... పైకి ఎగిరి దుమికే సీన్ లో ఐదుగురు తాళ్లు పట్టుకొని ఉన్నప్పటికీ ఏ ఒక్కరయినా పొరపాటుగా వదిలేస్తారేమోనని భయపడతాడట. ఇలా తన ఫోబియాల గురించి మొహమాటం లేకుండా చెప్పేశారు పవన్. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న లోటు పాట్ల గురించి కూడా ఏ హీరో ఓపెన్ గా మాట్లాడడు. ఎందుకంటే ఇండస్ట్రీలో పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే నొప్పించక తానొవ్వక అన్నట్టుండాలనే లౌక్యం ప్రదర్శిస్తారు. నిజాన్ని ఒప్పుకోవడానికి, బయటకు చెప్పటానికి ఇష్టపడరు. కానీ ఈ విషయాలు కూడా పవన్ కళ్యాన్ ఓపెన్ గానే మాట్లాడారు. బాలీవుడ్ లో తరచూ మల్టీస్టారర్ సినిమాలు వస్తుంటాయి కానీ తెలుగులో రాకపోవడానికి కారణం కూడా చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు ఒక మైండ్ సెట్ కావాలనీ, బాలీవుడ్ లో కూడా కొంత ఉన్నప్పటికీ, టాలీవుడ్ లో లాగా కాదన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు టాలీవుడ్ లో వెంకటేశ్ ఒక కొత్త సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారని అన్నారు. ఇందుకు వెంకటేశ్ ను అభినందించాలన్నారు ఆ క్రెడిట్ తనకు వర్తించదన్నట్టు! సినిమాల్లో నటించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా స్పష్టంగా చెప్పుకున్నారు. గోపాల గోపాల సినిమాలో విశ్వరూపం లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాననీ, ఒక రోజు షూటింగ్ కూడా కాన్సిల్ చేశానని చెప్పారు. ఆ సీన్ లో నటించాలంటే చాలా భయపడ్డారట. పది రోజులు ఆగాక తిరిగి ఆ సీన్ షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పారు. ఇలా మాట్లాడుతున్న ప్రతి మాటా ఒక హీరోలా కాకుండా సామాన్యుడిలా చెప్పుకుపోతుండడం వల్లనే కాబోలు ఇంతమంది అభిమానులను సంపాదించేశారు.