సినీ రంగంలోని ప్రముఖులు చాలా మంది సుపుత్రులను తన అడుగు జాడల్లో నడిపించారు కానీ, ఇంటి ఆడవారిని మాత్రం ఇంటికే పరిమితం చేశారు. ఇటీవల కాలంలో తమ వారసురాళ్ళను ఈ రంగానికి తీసుకు వస్తున్నారు కొందరు ఆదర్శ భావాలు గల తండ్రులు ఆ కోవలో కమల్ హాసన్, శరత్ కుమార్, అర్జున్ లు ఉన్నారు. అర్జున్ కూతురు ఐశ్వర్య ఇటీవలే సినీ రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాతో అంతగా పేరు తెచ్చుకోలేక పోయింది. ఇప్పుడు తండ్రి దర్శకత్వంలో కూతురు హీరోయిన్ గా నటిస్తోంది. ఇది సినీ పరిశ్రమలోనే ఓ అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ తండ్రీ కూతుర్ల బంధం గురు శిష్యుల బంధంగా మారింది. ఐశ్వర్య అర్జున్ ‘పట్టత్తు యానై’ చిత్రం ద్వారా కథా నాయకిగా పరిచయం అయ్యింది. ఈ సినిమాతో ఆమె హీరోయిన్ గా క్లిక్ అవ్వలేదు. ఇది ఆమెను బాగా నిరాశ పరిచింది. ఇప్పుడు ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో మలి ప్రయత్నానికి సిద్ధం అయ్యింది. ఈసారి ఈ బ్యూటీ తన తండ్రి దర్శకత్వంలోనే నటించడానికి రెడీ అవుతుండడం విశేషం. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కథక్ నృత్యకారిణిని. అందుకే ప్రస్తుతం కథక్ నృత్యం నేర్చుకుంటున్నాను. ఇంతకుముందే నేను డాన్సర్‌ని. కథక్ నృత్యం రాదు. అందుకే నేర్చుకుంటున్నాను. నాన్న సరిగా నటించకపోతే తిడతారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను’ అంది. మొదటి చిత్రం తరువాత రెండు అవకాశాలు వచ్చినా చేయలేదని చెప్పింది. తను నచ్చితేనే అంగీకరిస్తానంటోంది. ఇప్పుడు ఈ చిత్రానికి తనే కాస్టూమ్స్ డిజైనర్ గా చేస్తోంది. ఈమె లండన్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ఈ చిత్రానికి హీరో ఎంపిక ఇంకా జరగలేదట. నటులందరికీ కొంత కాలం శిక్షణ ఇచ్చాకే ఈ సినిమా మొదలు పెడతారట అర్జున్. తను నటించడంలో ఎంత డెడికేషన్ చూపిస్తారో, దర్శకత్వం స్వీకరించినప్పుడు కూడా నటుల నుంచి పూర్తి స్థాయి నటన తీసుకోవడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేస్తారట అర్జున్.