ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులు చాలవన్నట్టు ఆడియోను కూడా మే 31 అని పోస్టు పోన్ చేసి జూన్ 13న విడుదల చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి తిరుపతికి మార్చారు.యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం తిరుపతి, ఎస్.వి.యూనివర్సిటిలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, కీరవాణి, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, రమరాజమౌళి, డి.సురేష్‌బాబు, సాయికొర్రపాటి తదితరులు పాల్గొన్నారు.
రెబెల్‌స్టార్ కృష్ణంరాజు థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా ఆడియో లాంచ్ జరిగింది.
ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా..
రెబెల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. నాకు మొట్టమొదటగా మైక్ ముందు మాట్లాడాలంటే భయంగా ఉంది. ప్రభాస్ మిర్చిలాంటి పోగరుబోతు. డార్లింగ్‌లాంటి మంచి స్నేహితుడు. నిన్న డిల్లీలో ఉన్నప్పుడు అక్కడున్న పొలిటిషియన్స్ అందరూ రాజమౌళి ఎవరు? బాహుబలి సినిమా ఎంటని అడిగారు. రాజమౌళి ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లగలిగే గొప్ప దర్శకుడని వారికి చెప్పాను. ఆ గ్రాండియర్ ట్రైలర్‌లో కనపడుతుంది. చాలా గొప్ప కథ అని, చాలా గొప్పగా తీస్తున్నారని, రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమా అని పొరుగు రాష్ట్రాలవాళ్లు చెప్పుకుంటున్నారు. గర్వంగా ఉంది. ఇంటర్నేషనల్ స్థాయికి మనం తక్కువ కాదు. ఆ స్థాయి సినిమాలు మనం సినిమాలు తీయగలమని వారంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ గొప్ప రైటర్. ఆయనతో చాలా కాలంగా నాకు పరిచయం ఉంది. కథ మీద మంచి పట్టున్న దర్శకుడు. రాజమౌళి ప్రతి ఇంచ్‌ను గొప్ప తీయాలని చూస్తాడు. అందుకే కొద్దిగా ఆలస్యమైనా మనం గొప్ప సినిమాని చూడబోతున్నాం. ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి నాకంటే వయసులో చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా ఇటువంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలు తీయాలని ప్రపంచ ఖ్యాతి పొందాలని ఈ బాహుబలిని రెండు పార్ట్‌లుగానే కాదు. ఐదు పార్ట్‌లుగా తీయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ ‘‘కీరవాణిగారు నాకు బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన తప్ప ఈ సినిమాకి రీరికార్డింగ్ వేరేవాళ్లు ఇవ్వలేరు. నన్ను రాజమౌళిగారు స్టూడెంట్ నెంబర్ వన్ టైమ్‌లో కలిస్తే కుదరదు సార్ అనేశాను. ఆయన డైరెక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ అందరికీ నచ్చింది. నాకు పెద్దగా నచ్చలేదు. సింహాద్రి సినిమాకి నేను తారక్ పిలిస్తే ప్రివ్యూకి వెళ్లాను. ఆ సినిమా చూడగానే నాకు వండర్ అనిపించింది. అరే ఇలాంటి డైరెక్టర్‌కి ఏంటి అలా చెప్పేశాం..ఇక ఆయనతో సినిమాలు చేయడం కుదరదు అనుకున్నాను. దిల్ ఆడియో ఫంక్షన్‌లో మరోసారి రాజమౌళిగారిని కలిసిన సినిమా బాగుందని చెప్పాలంటే తను ఎమనుకుంటాడోనని భయపడ్డాను. అయితే చివరికి సింహాద్రి సినిమా చూశాను..బాగుంది సార్..అన్నాను. అప్పటికీ నా వర్షం సినిమా రిలీజ్ కాలేదు. త్వరలోనే మనం కలిసి సినిమా చేద్దాం అన్నారు. ఇలాంటి డైరెక్టర్స్ కూడా ఉంటారా అనిపించింది. తర్వాత మేం కలిసి ఛత్రపతి సినిమా చేశాం. అప్పుడు ఆయనతో మంచి రిలేషన్ ఏర్పడిరది. ఆయన మనస్తత్వమే డిఫరెంట్. గ్రేట్ సోల్..గ్రేట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా పర్సనల్, ప్రొఫెషనల్ సమస్యలన్నీ ఆయనతో పంచుకుంటుంటాను. ఆయన నన్ను తన సోల్‌మేట్ అన్నారు. కానీ నాకు ఆయన అంత కంటే ఎక్కువే. ఆరు సంవత్సరాలకు ముందు నన్ను కలిసి ఓ పెద్ద సినిమా చేద్దామన్నారు. అప్పటికీ మగధీర రిలీజ్ కాలేదు. నాకేమో నాలుగు ప్లాప్‌లున్నాయి. మగధీర రిలీజ్ అయింది. ఆయనింకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో చెబితే రాజమౌళి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ నీతో సినిమా ఎందుకు చేస్తాడని అన్నారు. పెద్ద సినిమా అన్నారు కానీ ఇంత పెద్ద సినిమా అని అనుకోలేదు. బాహుబలి వన్స్ ఇన్ లైఫ్ టైమ్ మూవీ. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. వారి ఫ్యామిలీతో కలిసి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. జూలై 10న బాహుబలితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
సూపర్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక టెక్నిషియన్ ఈ సినిమా కోసం హార్డ్‌వర్క్ చేశాడు. ఈ టీమ్‌లో ముఖ్యంగా కొందరి గురించి చెప్పుకోవాలి. టీం అలసిపోయిన ప్రతిసారి శివగామి క్యారెక్టర్ చేసిన రమ్యకృష్ణగారు మనం ఒక గొప్ప సినిమా చేశామని చెప్పి ఎనర్జీ ఇచ్చారు. ఆవిడ ఈ సినిమాలో పార్ట్ కావడం పట్ల ఆనందంగా ఉంది. అలాగే సత్యరాజ్‌గారు జెంటిల్‌మేన్. ఎంతో సీనియర్ యాక్టర్ అయినప్పటికీ డైరెక్టర్‌కి ఎంతో గౌరవమిచ్చేవారు. నాజర్‌గారు ఎక్స్‌పీరియెన్స్ అంత నా వయసుంటుందేమో..నా కో టెక్నిషియన్‌లా ఫీలవుతుంటాను. మనం ఏ సినిమా చేసినా క్లాసిక్‌లా నిలవాలని ఆయన అన్నారు. ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. నేనొక క్లాసిక్ మూవీ తీశానని అనుకుంటున్నాను. తమన్నా ప్రొఫెషనల్ హీరోయిన్. బల్గేరియాలో చలికి టెక్నిషియన్స్ అయిన మేం కూడా వెనుకాడతుంటే చలికి భయపడకుండా షాట్ చేసింది. కమిట్ మెంట్ ఉన్న నటి. దేవసేన క్యారెక్టర్‌ను అనుష్క తప్ప ఇంకెవరు చేయలేరు. ఎవరైనా హీరోయిన్‌తో మళ్లీ మళ్లీ నేను పనిచేయాలనుకుంటే నా ఫస్ట్ ప్రిపెరెన్స్ అనుష్కకే ఉంటుంది. ప్రభాస్‌తో జానపద సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. నా సినిమాలో హీరో కంటే విలన్ బలంగా ఉండాలి. అలాంటప్పుడు మేం రానా అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కానీ నాకున్న ఒకే అప్షన్ తనే. ముందు కథ వినగానే ఏం చెప్పకుండా వెళ్లిసోయాడు. నాలుగురోజుల తర్వాత వచ్చి ఇప్పుడే హీరోగా చేస్తున్నాను. అలాంటిది విలన్‌గా చేయమంటున్నారు..ఎం చేయాలి అని అడిగాడు. నేను రానా ఈ సమయంలో నువ్వే డిసిషన్ తీసుకోవాలి. నేను నీ క్యారెక్టర్ గురించి ఏదైతే చెప్పానో దాన్ని తెరపై చూపిస్తానని చెప్పాను. రెండు, మూడు గంటల్లో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. రానా తను చాలా సాఫ్ట్ పర్సన్. మా నాన్నగారు విజయేంద్రప్రసాద్‌గారి నుండే క్యారెక్టర్‌ను డ్రెమటైజేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నిజంగా రమా తోడు లేకుండా ఈ సినిమా చేసుండేవాడిని కాదు. కీరవాణిగారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గైడెన్స్ చాలా బాగుంటుంది. అలాంటి సంగీత దర్శకుడు ఎవరికీ దొరకడు. ఈ సినిమా షూటింగ్ ఏ ఆటంకం లేకుండా జరిగిందంటే కారణం వల్లిగారే. మా అబ్బాయి కార్తికేయ. ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులన్నీ తనే చూసుకున్నాడు. తను బాగా వర్క్ చేశాడని ఎప్పుడూ చెప్పలేదు. అయితే తప్పులకి తననే తిట్టేవాడిని..వాడు వాటన్నింటినీ భరించాడు. ఛత్రపతి సినిమా టైమ్‌లో నేను, ప్రభాస్ బాగా కలిసిపోయాం. ఈ సినిమా విషయానికి వస్తే నువ్వు గొప్ప సినిమా తీస్తున్నావని నా వెన్ను తట్టింది ప్రభాస్. డార్లింగ్..మీరు ఏ సినిమా తీస్తున్నారో తెలుసా..మీరు తెలుగు సినిమా తీయడం లేదు. ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు తెలుసా..అనేవాడు. ఆరు సంవత్సరాల క్రితం ఓ పెద్ద సినిమా చేస్తున్నామని, నాలుగు సంవత్సరాల క్రితం బాహుబలి లైన్ రఫ్‌గా తనకి చెప్పాను. మూడు సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథంతా చెప్పాను. రెండు సంవత్సరాల క్రితం తనని ఒక సంవత్సరం పాటు డేట్స్ అడిగాను. అయితే తను రెండు సంవత్సరాలు డేట్స్ ఇవ్వడమే కాదు. ఈ రెండేళ్లలో ఏనాడూ..ఎంటిది ఇలా తీస్తున్నారని ఎవరిని అడగలేదు. మాకు ప్రతిసారి బూస్టప్ ఇచ్చాడు. మా అందరికంటే తనకే ఈ సినిమాపై ఎక్కువ నమ్మకం ఉండేది. ఆ నమ్మకమే మా అందరికీ బలాన్నిచ్చింది. తనని బాగా కష్టపెట్టాను. కానీ ప్రతి కష్టాన్ని భరించి పూర్తి చేశాడు అందుకు తనకి థాంక్స్’’ అన్నారు.
రానా మాట్లాడుతూ ‘‘ఎనభై ఏళ్లుగా మమల్ని తెలుగు ప్రజలు భుజాలపై మోసుకుంటూ బాహుబలి వరకు తీసుకు వచ్చారు. నాకు చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణంలో ఉండటంతో హీరోలే దేవుళ్లు, పురాణ సినిమాలే ఇతిహాసాలైపోయాయి. నాకు నందమూరి తారకరామారావుగారే శ్రీకృష్ణుడు, అల్లూరి సీతారామరాజంటే సూపర్‌స్టార్ కృష్ణగారే, భక్తకన్నప్పంటే రెబల్‌స్టార్ కృష్ణంరాజుగారే అలాంటి వాతావరణంలో పెరిగాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు మూడు సంవత్సరాలు తీయబోయే సినిమాలో విలన్‌గా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. వారందరికీ నేను చెప్పే జవాబు ఒకటే, కాలం అనేది కరిగిపోయే క్షణాలయితే, మా బాహుబలి కలకాలం నిలిచిపోయే శిల్పం. ఈ సినిమా ఒక గ్రంథం కాదు ఇతిహాసం. మనకు రామాయణం ఎలాగో ఈ సినిమా అలాంటి ఇతిహాసం. అలాంటి సినిమాలో నటించమంటే ఎందుకు నటించను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాజమౌళిగారికి, నిర్మాతలకు, ప్రభాస్‌కి, ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు.
ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించిన దర్శకుడు. చాలా తక్కువ సమయంలో ఈ ప్రోగ్రామ్ కండెక్ట్ చేస్తాం. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి వెళ్లనున్నాం. తెలుగు వారందరూ గర్వపడే సినిమా అవుతుంది. సినిమా ఏడాది పాటు సక్సెస్‌ఫుల్‌గా ఆడి ఆ ఫంక్షన్‌ను జరుపుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు ఎప్పుడూ క్వాలిటీ కోసం తాపత్రయ పడుతుంటారు. మంచి ప్రొడక్ట్ కావాలంటే వెయిట్ చేయాల్సిందే’’ అన్నారు.
కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘నిజానికి ఈ కథను రాసింది నేను కాదు. ఈ సినిమా డిలే కావడానికి నాకు సంబంధం లేదు. దేవుడే ఈ కథను రాశాడు. సృష్టి దగ్గర నుండి అన్నీ విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. భగవంతుడు సృష్టి చేద్దామని కళ్తు తెరిస్తే అంతా చీకటే కనపడుతుంది. కాంతి కనపడటం లేదు. ఆ చీకట్లో ఒక పిల్లవాడు కనపడ్డాడు. అంతే కాకుండా ఆ పిల్లవాడు కాంతినంతా బంతిలాగా చేసి ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని చూసి దేవుడికి ముచ్చటేసింది. ఆ పిల్లాడికి సెంథిల్ అని పేరు పెట్టాడు. భవిష్యత్‌లో బాహుబలి అని సినిమా చేసి ప్రపంచ ఖ్యాతి పొందమన్నాడు. తర్వాత గుర్రాలు, ఎనుగులు ఒక వంద దాకా సృష్టించాడు. చివర్లో లెక్కించితే లెక్క కాస్తా ఎక్కువైంది. ఎవరు చేస్తున్నారా అని చూస్తే, తనలాగే ప్రతిసృష్టి చేస్తున్న మరో పిల్లాడు కనపడ్డాడు, అతనికి సాబుశిరిల్ అని పేరు పెట్టి బాహుబలికి ఆర్ట్ డైరెక్షన్ చేయమన్నాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే పనికోసం మరో పిల్లాడిని సృష్టించి శ్రీనివాస్ మోహన్ అని పేరు పెట్టాడు. వెనుక వైపు మరో పిల్లాడు ఫైట్స్ చేస్తూ కనపడ్డాడు, ఆ పిల్లాడికి పీటర్ హెయిన్స్ అని పేరు పెట్టాడు. చివరకు కథ విషయంలో నన్ను సృష్టించి కథ చెప్పమంటే కాళకేయుల భాషలో చెప్పాడు. ఆ భాష నాకు అర్థం కాదు కాబట్టి నాకు ఇంత సమయం పట్టింది. తప్పు నాది కాదు’’ అన్నారు.
అడవి శేష్ మాట్లాడుతూ ‘‘కాళకేయ పాత్రను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలో నేను భద్ర రోల్ చేశారు. రాజకుమారుడి పాత్ర. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. నా కెరీర్‌లో మంచి రోల్ వస్తే బాగుండునని అనుకున్నాను. ఆ టైమ్‌లో పంజా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత శోభుగారి సపోర్ట్‌తో రాజమౌళిగారిని కలిశాను. అప్పుడు ఆయన ఎం చెప్పలేదు. ఆరు నెలలు తర్వాత నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో ఎప్పుడైనా చేయడానికి నేను సిద్ధమే. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు.
రమ్యకృష్ణ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఈ సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇందులో నేను ఒక పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. రాజమౌళిగారు స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలబడ్డారు. వల్లిగారు లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేదే కాదు. సినిమా ఏం ఆలస్యం కావడం లేదు. హాలీవుడ్‌లో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది’’ అన్నారు.
నాజర్ మాట్లాడుతూ ‘‘నా కెరీర్ అంతా ఇలాంటి పాత్ర కోసమే చూశాను. నేను చేసిన పాత్రల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ ఇది. ఎందుకంటే ఇదొక కాంప్లికేటెడ్ క్యారెక్టర్’’ అన్నారు.
సత్యరాజ్ మాట్లాడుతూ ‘‘డిలే ఎందుకు అవుతుందని అందరూ అడుగుతున్నారు. ప్రభాస్ ప్యాన్స్‌ని శాటిస్‌ఫై చేయడానికే అందరూ కృషి చేశారు. అంతే కాకుండా అవతార్ దర్శకుడు జేమ్స్‌కామెరూన్ కూడా ఒక కారణం. ఆయన ఈ సినిమా సినిమా చూసి స్టన్ కావాలి. హాలీవుడ్‌కి రావద్దని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయాలి. అవతార్ సినిమాని తెలుగులో ఎలా డబ్ చేశారో ఫ్యూచర్‌లో బాహుబలి సినిమాని ఇంగ్లీష్‌లో డబ్ చేస్తారు. ఆ సమయం త్వరలోనే వస్తుంది’’ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం చాలా మంది హార్డ్ వర్క్ చేశారు. రాజమౌళిగారికి థాంక్స్. కీరవాణిగారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఎప్పుడు విన్నా ఆయన పాటలు వినాలపించేలా ఉన్నాయి’’ అన్నారు.
అనుష్క మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్లాగానే మేం కూడా బాహుబలి కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే థియేటర్స్‌లో కలుసుకుని ఎంజాంయ్ చేద్దాం’’ అన్నారు.
రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడివి శేష్, ప్రభాకర్ తదితరులు ఇతర తారగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.