ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘బాహుబలి’ వార్తలు వింటుంటే అబ్బురంగా అనిపిస్తుంది. సినిమా తీయడం కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నట్టే ఈ రైట్స్ వివిధ భాషలకు ఊహించని రేటుకి వెళ్లాయి. దీంతో ‘బాహుబలి’ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా మూవీ ఆడియో ఫంక్షన్ ఈనెల 31న గ్రాండ్‌గా జరగబోతోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. కాకపోతే ఈ ఫంక్షన్‌ని లైవ్ టెలికాస్ట్ హక్కుల్ని తెలుగులో ఓ ఛానెల్ కోటిన్నర పెట్టి కొనుగోలు చేసినట్టు సమాచారం. ‘బాహుబలి’ భారీతనాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌పీల్ని పెంచుకోవడానికే ఈ సాహసానికి పూనుకున్నారా? అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ర్టీలో దీనిపై చాలా చర్చ జరుగుతోంది. ఓ మోస్తరు సినిమాల ఆడియో ఫంక్షన్‌లన్నీ ఒకటి రెండు న్యూస్ ఛానెల్స్ మాత్రమే కొన్నిరోజులుగా టెలికాస్ట్ చేస్తూ వస్తున్నాయి. కోటిన్నర పెట్టుబడి పెడితే, కమర్షియల్ బ్రేక్‌ల ద్వారా కనీసం రెండు కోట్లైనా ఆ ఛానెల్ రాబట్టుకోవాలి. ఈ సాహసం చేసింది టీవీ 5 ఛానెల్ అని తెలుస్తోంది. కానీ, మార్కెటింగ్ షేర్‌లో న్యూస్ ఛానెల్స్ కి వుండే వాటా గురించి తెలిసినవాళ్లు దీన్ని అసాధ్యంగానే చెబుతున్నారు. మరి ఒక్క సినిమా ఆడియో ఫంక్షన్ టెలికాస్ట్ హక్కుల కోసం కోటిన్నర వెచ్చించిన ఈ ఛానెల్ గురించి అంతటా చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ ఆడియో హక్కుల్ని లహరి వారు మూడు కొట్లకు సొంతం చేసుకోవడంపై కూడా పెద్ద చర్చకు దారి తీసింది. మొత్తం మీద విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి సినిమా ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై అంతటా ఉత్కంఠ నెలకొని ఉంది.