తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టిక్కెట్ల గోల రచ్చ రచ్చ అవుతుంటే, ఉత్తరాదిన మాత్రం ఆ హంగామా ఏమీ కనిపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముంబాయి, ఢిల్లీ, కలకత్తా లాంటి ప్రధాన నగరాలలో ‘బాహుబలి’ హిస్టీరియా కనిపించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమా హక్కులను ప్రముఖ బాలీవుడ్ సినిమా నిర్మాత కరణ్ జోహార్ పొందటమే కాకుండా ఈ సినిమాను ముంబాయి, ఢిల్లీ నగరాలలో చాల పెద్దఎత్తున ప్రమోట్ చేసాడు. స్వయంగా రాజమౌళి, ప్రభాస్, తమన్నా, అనుష్కలు ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు. తమన్నా అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ మీడియాలో చాల పెద్ద హడావిడి చేసింది. అయితే ఈ భారీ ప్రచారం ముంబాయిలో ‘బాహుబలి’ కి పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడంలేదు ఈ సినిమా ప్రదర్శింపబడే ధియేటర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లు రెండు రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. అదేవిధంగా ఈ సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ కూడా ఓపెన్ అయి రెండు రోజులు గడుస్తున్నా 50 శాతం కూడా బుక్ అవ్వలేదు అన్న వార్తలు కరణ్ జోహార్ ను షాక్ కి గురి చేస్తోందట. ఈ ప్రభావం మిగతా ప్రాంతాలను కూడా ప్రభావితం చేయవచ్చని అనుకుంటున్నారు.
ఉత్తరాదిన ఈ పరిస్థితి ఉంటే, తెలుగు రాష్ర్టాల్లో మాత్రం ‘బాహుబలి’ టిక్కెట్ల అమ్మకంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు న్యాయస్థానం మెట్లు ఎక్కితే, న్యాయస్థానం ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఉత్తరాది విషయంలో వస్తున్న వార్తలకు రాజమౌళి ఎలా స్పందిస్తున్నారో తెలియాల్సి ఉంది.