దిల్ రాజు ముందు డిస్ట్రిబ్యూటర్ ఆ తరువాతే నిర్మాత... అంటే ఏ సినిమాలు బాగా ఆడతాయో, ఏ సినిమాలకు కలెక్షన్లు రాబట్టేలేమో ఆయనకు బాగా తెలుసు. ఎంత ఖర్చు పెడితే ఎంత లాభం రాబట్టవచ్చునో కూడా అంచనా వేయగల దిట్ట. అన్ని సార్లు కాకపోయినా ఎక్కువ శాతం ఆయన అంచనాలకు తిరుగుండదనే చెప్పాలి. టాలీవుడ్ సినిమాలన్నటికీ నైజాం ఏరియాకు ముందుండేది ఆయనే. సన్నాఫ్ సత్య పూర్తి నైజాం రైట్స్ ను 13 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే అంత అవసరమా అన్నారు జనాలు. కానీ ఆ సినిమా డివైడ్ టాక్ ను తట్టుకుని రాజు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చి పెట్టింది. అయితే ఎంత పెద్ద సినిమా అయినా, నైజం ఏరియాలో ఇప్పటి దాకా ఎవ్వరూ 15 కోట్ల పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు. అలాంటిది బాహుబలి నైజాం రైట్స్ కోసం ఏకంగా రూ.22.5 కోట్లు పెట్టాడు రాజు. ఇది మరీ రిస్క్ కదా అని అడిగితే... ‘‘బాహుబలి స్పెషల్ మూవీ. దీనికి హద్దులు లేవు. మగధీర లాగే తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంటే మనం ఆశ్చర్యపోయే కలెక్షన్లు వస్తాయి. అందరికీ తెలియని విషయం ఏంటంటే... మన జనాభాలో థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే వాళ్లు 12- 18 శాతం మాత్రమే. వీరిలో ఐదు శాతం పెరిగినా లెక్కలన్నీ మారిపోతాయి. బాహుబలి లాంటి సినిమా వచ్చినపుడు మ్యాజిక్ లు జరుగుతాయి. మగధీరకు వచ్చినట్లే మార్నింగ్ షోతో హిట్ టాక్ వస్తే బాహుబలి చరిత్ర సృష్టించడం ఖాయం’’ అని చెప్పారు దిల్ రాజు.