ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీసు బద్దలు కొడుతున్న జక్కన్న ‘బాహుబలి’ ఓ కన్నడ సినిమాలా ఉందన్న వార్తలు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినిమాను ఓ పక్క అక్కడి మీడియా వాళ్ళు పోగుడ్తూనే మరో పక్క చురకలు కూడా వేస్తున్నారట. ఈ సినిమా కన్నడ సూపర్ స్టార్ రాజకుమార్ నటించిన ‘మయూర’ సినిమాను పోలి ఉందని అంటున్నారు. 1975 ప్రాంతాలలో విడుదలైన ‘మయూర’ సినిమా ఆరోజుల్లో అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కన్నడ డైరెక్టర్ విజయ్ దర్శకత్వం వహించగా ఆనాటి స్టార్స్ శ్రీనాథ్, మంజులా, వజ్రమని తదితర నటీనటులు ప్రధానపాత్రలు పోషించారు. అప్పట్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమానే దర్శకుడు రాజమౌళి కొద్దిగా మార్పులు చేసి గ్రాఫిక్స్ అద్ది ‘బాహుబలి’ గా మార్చాడని కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది. మరొక ఆ సక్తికరమైన విషయం ఏమిటంటే రాజమౌళి స్వస్థలం కర్నాటకలోని రాయచూర్ కావడంతో ఈ సినిమా గురించి పూర్తి అవగాహన రాజమౌళికి ఉండే ఉంటుందంటూ కన్నడ మీడియా అంటోంది. ఏది ఏమైనా ఎవరేమన్నా ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బాహుబలికి మాత్రం అందరూ బ్రహ్మరథం పడుతున్నారు.