బాహుబలి వైజాగ్ హక్కులు రూ.9.6కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. తెలుగు సినిమాకు సంబంధించి ఒక ఏరియా హక్కులు, మరీ ముఖ్యంగా వైజాగ్ ఏరియా హక్కులు ఇంత భారీ స్థాయిలో ఇంతవరకు సేల్ కాలేదన్నది వాస్తవం. దాదాపు రెండున్నరేళ్లుగా రాజమౌళి అండ్ టీమ్ చెమటోడ్చి రూపొందిస్తున్న సినిమా బాహుబలి. మే 15న విడుదల కానుంది. కీరవాణి ఓ వైపు రీరికార్డింగ్ పనులతో బిజీగా ఉన్నారు. షూటింగ్ పూర్తవడంతో గుమ్మడికాయ ఫంక్షన్ కూడా చేసేశారు. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ గురించి అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. నైజామ్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తాన్ని చెల్లించి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు హిందీ, తమిళ హక్కులను కూడా నిర్మాతలు ఇదివరకే విక్రయించేశారు. ఓవర్సీస్‌లోనూ ఈసినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో వైజాగ్ హక్కులు అమ్ముడైన తీరు చూసి సీడెడ్ వర్గాలు నోరెళ్ల బెడుతున్నాయి. సీడెడ్‌లో ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో చూడాలి మరి.