బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమాలు వస్తున్నాయంటే ఎంత పెద్ద హీరో అయినా తోక ముడవాల్సిందే. అయితే షారూఖ్ సినిమాకు ఎదురెళ్లి మరీ డైరక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తన మెగా ప్రాజెక్ట్ బాజీరావును విడుదల చేశాడు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం ఇచ్చిందో సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే రివ్యూలు చక్కర్లు కొడుతున్నాయి.
రామ్ లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్ గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్ లను చెప్పి మెప్పించాడు. ఇక మస్తానీ గా నటించిన దీపికా పదుకునే ఇందులో తొలిసారిగా మేకప్ లేకుండా నటించింది. నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా పెద్దగా చేసిందేం లేదు.
ఇక తన ప్రతి సినిమాలోనూ చూపించినట్టే గ్రాండ్ విజువల్స్ తో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు సంజయ్ లీలా బన్సాలీ. అయితే విజువల్ గా ఆకట్టుకున్నా కథా కథనాల పరంగా మాత్రం ఆశించిన స్థాయి అందుకోలేకపోయాడట. ఇలాంటి చిత్రాలకు ప్రాణం పోయాల్సిన మ్యూజిక్ విషయంలో కూడా బాజీరావ్ మస్తానీ తీవ్రంగా నిరాశపరిచినట్లు తెలుస్తోంది. ఓ హిస్టారికల్ వార్ డ్రామాను తెరకెక్కించేటప్పుడు ఆసక్తికర అంశాలను తీసుకోవాలి. కానీ, దర్శకుడు ఇక్కడ వాటిని పూర్తిగా వదిలేశాడట. దీంతో సినిమాకి కావాల్సిన వేగం ఇందులో కనిపించలేదని తెలుస్తోంది. ఓవరాల్ గా విజువల్ గా చూడటానికే తప్ప బాజీరావులో పెద్ద మ్యాటర్ ఏం లేదు.