సాధారణంగా తమ అభిమాన తారలు కనిపిస్తే వారిని కళ్ళ నిండుగా చూసుకోవడం... కుదిరితే... ఓ షేక్ హాండ్ అదృష్టం కలిసొస్తే ఓ ఫొటో... తీసుకోవడం జరుగుతుంది. కానీ నేరుగా అభిమాని కోరిక తీర్చడానికి ఓ సూపర్ స్టార్ వారిదగ్గరికే వెళితే ఆ ఆనందం కట్టలు తెంచుకోదా? అదే జరిగింది ఇప్పుడు. హైదరాబాద్ లోని గోపాలంపల్లిలోని మంజీరా అపార్ట్ మెంట్స్ లో నివశిస్తున్న కుటుంబం అభిమాన హీరో రాకతో నేడు(28.07.) పండగ చేసుకుంది. వాళ్లలా ఆనందపడటానికి కారణం బాలకృష్ణ నేరుగా వాళ్ళింటికి వెళ్ళడమే. వారింటికి దగ్గర్లో బాలయ్య ‘డిక్టేటర్’ షూటింగ్ జరుగుతోంది. కొన్ని క్లిష్టమైన సన్నివేశాలను చిత్రదర్శకుడు శ్రీవాస్ చిత్రీకరిస్తున్నారు. నిర్విరామంగా షూటింగ్ చేస్తూ, బిజీ బిజీగా ఉన్న బాలయ్యకో విషయం తెలిసింది. ఓ 90 ఏళ్ల వృద్ధురాలు బాలయ్యను చూడాలనుకుంటోందని. ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీంతో బాలయ్యే స్వయంగా ఆమె దగ్గరికెళ్ళాడు. విజయవాడ కస్తూరిబాయ్ పేటకు చెందిన విజయ లాయర్. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి, తన చిన్న కూతురి ఇంట్లో ఉంటోంది. ఆమె ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆమెకు తన అపార్ట్ మెంట్ దగ్గర బాలయ్య షూటింగ్ చేస్తున్న విషయం తెలిసింది. అంతే చూడాలనుకున్నారు. ఎలాగైనా షూటింగ్ స్పాట్ దగ్గరికి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులను కోరారరట. విషయం తెలుసుకున్న బాలయ్య తానే స్వయంగా వెళ్లాడు. ఆమెను పలకరించారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కూడా బాలయ్య కుటుంబం గురించి అడిగింది. ‘మీ పిల్లలకు పెళ్లయ్యిందా?’ అని అడిగారు. పిల్లల గురించి కూడా బాలయ్య ఆమెకు చెప్పారు. ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చూశానని, మహా నటుడని ఆమె బాలయ్యకు చెప్పారు. అలాగే, ‘శ్రీరామరాజ్యం’ చిత్రం చూశానని, చాలా బాగా నటించారని బాలయ్యతో ఆమె అన్నారు. అప్పటి రాజకీయాల గురించి కూడా బాలయ్యతో విజయ చర్చించడం విశేషం. ఇలా ఓ అభి మానిదగ్గరకు వెళ్ళి ఆమెతో ముచ్చటించడం ఇంతకుముందెప్పుడూ జరగని విషయం. సినీ తారలు తమ చుట్టూ చేరే అభిమానులను తప్పుకొని వెళ్ళడం చూశాం... కానీ ఇలా అభిమాని కోరిక తీర్చేందుకు నేరుగా వారింటికే వెళ్ళడం గోపాలంపల్లిలో పెద్ద చర్చనీయాంశమైంది.