బాలయ్య పేరు చెబితే చాలు మాస్ జనాలకి పూనకం వచ్చినట్లు ఓ ఊపు వచ్చేస్తుంది. తన ప్రేక్షకుల కోసం అలరించే డైలాగులు, పాటలు, స్టెప్పులు అందించటంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. అదే టైంలో ఫైట్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు దర్శకులు. బాలయ్య కూడా తన వయస్సును పక్కనపెట్టి అవసరమైతే భారీ ఫైట్లకు కూడా సిద్ధమైపోతారు. ఆయన ఉత్సాహాన్ని గమనించిన స్టంట్ మాస్టర్లు కూడా అదే లెవల్లో ఫైట్లను రూపుదిద్దుతుంటారు. ఆయన అభిమానులను ఏ మాత్రం డిస్సాపాయింట్ కలిగించకుండా డిజైన్ చేస్తుంటారు.
ఇక అలాంటి ఫైట్లలో డూప్ లేకుండా చేయడం కూడా బాలయ్యకి అలవాటే. ప్రస్తుతం 'డిక్టేటర్' సినిమా విషయంలో కూడా ఆయన అదే ఫాలో అయిపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్లను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఇవి ప్రమాదకరమైన రిస్కీ ఫైట్లు కావడంతో, డూప్ తో చేయించాలని మొదట యూనిట్ నిర్ణయించుకుందట. అయితే డూప్ అవసరం లేదంటూ బాలయ్య ఈ యాక్షన్ ఎపిసోడ్ లో స్వయంగా పాల్గొంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడని తెలుస్తోంది. ఈ ఫైట్లే సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.