ఒక స్టార్ హీరో వందో సినిమా పూర్తిచేస్తున్నాడంటే ఇప్పుడున్న పరిస్థితిలో అది ఒక రికార్డే. ప్రస్తుతం ఉన్న తరంలోని హీరోలకైతే అది కత్తి మీద సామే. అయితే సీనియర్ నలుగురు స్టార్ హీరోలలో కూడా ఆ ఫీట్ సాధించిన మొనగాడు ఒక్క మెగాస్టార్ చిరంజీవే. వెంకీ 73 తక్కువ సినిమాలతో, నాగ్ 93 తో సెంచరీకి చేరువయ్యాడు. అయితే బాలయ్య మాత్రం నెక్స్ట్ ప్రాజెక్టుతోనే సెంచరీ కొట్టబోతున్నాడు. ప్రస్తుతం 99 డిక్టేటర్ తో బిజీగా ఉన్న బాలయ్య వందో ప్రాజెక్టు ఏంటన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
నందమూరి వంశం నుంచి ఈ నటసింహం పవర్ ఫుల్ చిత్రాలకు పెట్టింది పేరు. దీంతో గతంలో సింహా, లెజెండ్ లతో బాలయ్యకు సాలిడ్ హిట్లు ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలోనే 100వ చిత్రం ఉంటుందని సమాచారం. అందుకుగానూ గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు ఆ ఫ్లేసులోకి వచ్చి చేరుతుందని వార్తలు వినవస్తున్నాయి. అదే ఆదిత్య 369 సీక్వెల్.
నిజానికి ఈ సీక్వెల్ 'ఆదిత్య 999' పేరుతో గతంలోనే తెరకెక్కనుందని అంతా అనుకున్నారు. టైమ్ మిషిన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన బాలయ్య మదిలో మెదిలిందట. అంతేకాదు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వినిపించిన కథ కూడా బాలయ్యకు సంతృప్తిని కలిగించిందట. వారాహి బ్యారన్ పై సాయి కొర్రపాటి నిర్మాతగా త్వరలోనే ఈ సీక్వెల్ పట్టాలెక్కవచ్చని అనుకుంటున్నారు. ఇక ఇదే బాలకృష్ణ 100వ సినిమా కావొచ్చని మరి కొంతమంది అంటున్నారు. మరి వందలో ఏదీ ఫిక్సవుతుందనేది బాలయ్య నోటి నుంచే వస్తే బావుంటుందేమో.