బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడీయోలో అంగరంగ వైభవంగా శుక్రవారం పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై పూజలో పాల్గొని, క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక దాదాపు తెలుగు చిత్ర సీమలోని అగ్ర దర్శకులు, హీరోలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరవ దర్శకత్వం దాసరి నారాయణరావు వహించగా నటులు చిరంజీవి, వెంకటేశ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఇంతదాకా బాగానే ఉంది. అయితే చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యిందే అన్నపూర్ణ స్టూడియోలో. అలాంటప్పుడు నాగార్జున ఈ వేడుకకు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ హీరోల్లో వీరిద్దరికి పడదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చిరుతో కూడా ఆ మధ్య బాలయ్యకు పొసగట్లేదని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన్ని మాత్రం వేడుకకు పిలవటంతో అంతా గమ్మునుండిపోయారు. కానీ, గతంలో ఉన్న మనస్పర్థలు పక్కనబెట్టి బాలయ్య ఈ పంక్షన్ కి నాగ్ ని ఆహ్వానిస్తాడని అంతా అనుకున్నారు. పైగా అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ ప్రారంభం కావటంతో తప్పకుండా నాగ్ వస్తాడని అంచనా వేశారు. కానీ, అలాంటిదేం జరగలేదు. బాలయ్య నుంచి పిలుపు అందకపోవటం వల్లే నాగార్జున ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. అంటే బాలయ్య, నాగ్ ల మధ్య వైరం ఇంకా ముగియనట్లేనా?