తమిళనాడులో ప్రస్తుతం బీప్ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. మహిళలను ముఖ్యంగా యువతులను తిడుతూ రూపొందించారు ఈ పాటను. ఇక మహిళలకు వ్యతిరేకంగా పాట పాడి అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్న తమిళ నటుడు శిలంబరసన్ అలియాస్ శింబు. మహిళ సంఘాల ఫిర్యాదుతో ప్రస్తుతం శింబును అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. అయితే శింబు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ తరుణంలో శింబు స్పందించాడు. ప్రచారంలో ఉన్నట్టుగా తానెక్కడికీ పారిపోలేదని, తాను తమిళనాడును విడిచి ఎక్కడికీ వెళ్లబోనని అన్నాడు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనని అన్నాడు. తానెలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ కేసులో 19న హాజరు కావాలని శింబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లకు కోవై పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముందస్తు బెయిలు కోసం శింబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.