బాహుబలి-2 తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు దర్శకధీరుడు రాజమౌళి. మొదటి పార్ట్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినప్పటికీ అతని స్థాయికి తగిన సినిమా కాదంటూ తెలుగు ప్రేక్షకులు కొందరు బాహటంగానే పెదవి విరిచారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బాహుబలిలో స్టోరీ కన్నా గ్రాఫిక్స్ పైనే ఎక్కువ దృష్టిసారించాడని అందుకే రాజమౌళి గత చిత్రాల్లోని ఎమోషన్ ఇందులో మిస్సయ్యిందని ఫ్యాన్స్ ఫీలింగ్. దీంతో రెండో పార్ట్ లో ఎటువంటి తప్పులు దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కిలికిలి అనే కొత్త భాషను పరిచయం చేసిన విషయం తెలిసిందే. మాహిష్మతి రాజ్యంపై దాడికి వచ్చే కాళకేయుల అధికార భాషగా దీనిని చూపాడు దర్శకుడు. కాస్త హాస్యాస్పదం అయినప్పటికీ కిలికిలి బాగానే పాపులర్ అయ్యింది. దీంతో రెండో భాగంలో కూడా దీనిని కొనసాగించాలని జక్కన్న డిసైడ్ అయ్యాడు. అంతేకాదు సినిమా స్టోరీ మార్పులో భాగంగా ఇందులో మరో భాష ఉండబోతుందని తెలుస్తోంది.
అదే బురి బురి భాష. వినటానికి ఫన్నీగా ఉన్న దీనిని కథలో భాగంగానే వాడబోతున్నారట. ఇక కథ విషయానికొస్తే... ముఖ్య నాయకుడు చనిపోవటంతో చెల్లాచెదురైన కాళకేయులు ఉత్తరాదిన ఉన్న మరో రాక్షస సైన్యంతో చేతులు కలుపుతారంట. అలా తిరిగి మాహిష్మతిపై దండెత్తిన సమయంలో దేవసేన కోసం రాజ్యాన్ని వదిలి అరణ్య వాసంలో ఉన్న బాహుబలి తల్లి శివగామి పిలుపు మేరకు తిరిగి యుద్ధంలో వారితో తలపడి రాజ్యాన్ని కాపాడతాడంట. ఆపై సింహసనం పై ఉన్న రాజు(భళ్లాలదేవుడి) ఆదేశంతో కట్టప్ప బాహుబలిని చంపటం, ఆపై శివుడి ప్రతీకారం ఇలా కథ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక కొత్త రాక్షస తెగ నాయకుడిగా బాలీవుడ్ లేదా హాలీవుడ్ నటుడిని తీసుకునే అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ మరో రాక్షస తెగ కోసం తయారు చేయబోతున్నదే ఈ బురి బురి భాష. గతంలో కిలికిలిని రూపొందించిన మదన్ కార్కీ ఆధ్వర్యంలోనే ఈ భాష రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.