బాలకృష్ణ లెజెండ్ తరువాత సినిమా లయన్ కు చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తన నట విశ్వరూపాన్ని మరో సారి ప్రదర్శించడానికి ఆయన డిక్టేటర్ గా రాబోతున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్ మే 29న లాంఛనంగా ప్రారంభమవుతుందని ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ శనివారం హైదరాబాద్ లో వెళ్లడించారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ 12 నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీతోపాటు యూరప్ దేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తుందని చెప్పారు. బాలకృష్ణతో నయనతార నటించడం ఇది మూడవ సారి. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు విజయం సాధించాయి.... అలాగే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీవాస్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారని శ్రీవాస్ తెలిపారు. డిక్టేటర్ చిత్రాన్ని ఈ సంవత్సరం దసరాకు విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.