ఆ మధ్య సత్యం శివం సుందరం... అంటూ తన కంఠంలో లతాజీ గళాన్ని ఇముడ్చుకున్న ఓ పేద బాలిక పాట ఇంటర్ నెట్ లో హల్చల్ చేసింది. ఈ పాట విన్న నెటిజన్లు ఆ బాలికను సినిమాల్లో పాడించమని సంగీత దర్శకులను వేడుకున్నారు. చివరికి ఆ బాలికను కనుగొని ఓ సినిమా దర్శకుడు ఆ అమ్మాయి చేత తన సినిమాలో పాటలు పాడించాడు కూడా. ఇప్పుడు జార్ఖండ్‌లో 17 ఏళ్ల అంధ విద్యార్ధిని తుంపా కుమారి పాడిన ఓ పాట నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రాంచీలోని బ్రజ్ కిశోర్ అంధుల పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థిని గొంతులోని మాధుర్యానికి అంతా ముగ్ధులవుతున్నారు. పాపులర్ సింగర్ సోనూ నిగమ్ వద్ద తాను శిక్షణ పొందాలనుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తుంపా కుమారి తెలిపింది. ‘ఆషికి-2’ చిత్రంలో శ్రేయా ఘోషల్ పాడిన పాటను ఈమె పాడినప్పుడు మెచ్చుకోనివాళ్లు లేరు. అసలు వీడియోలో రికార్డయిన పాటనే ఈమె పాడిందా అని చాలామంది అనుమానపడ్డారు. అల్కా యాజ్ఞిక్, శ్రేయా ఘోషల్‌లు తన రోల్ మోడల్స్ అని ఈ అమ్మాయి చెప్పుకుంటోంది.