నేపాల్ భూకంపం అంతులేని నష్టానికి గురి చేసింది. వారికి చేయూత నిచ్చేందుకు తమ వితరణతో పాటు ప్రజల నుంచి చందాలు పోగు చేసేందుకు బయలుదేరారు బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అనుష్కాశర్మ, ప్రీతిజింతా. కోట్లు గడించిన వారే అయినా... అంతా కలిసి జోలె పట్టి భిక్షాటనకు బయల్దేరారు. నేపాల్ బాధితులను ఆదుకోడానికి విరాళాలు సేకరించేందుకు కేర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి స్టార్ ఇండియా సంస్థ చేపట్టిన కార్యక్రమానికి వీళ్లంతా తమవంతు సాయం అందిస్తున్నారట. 'పొరుగువారికి పొరుగువాళ్లే సాయం చేయగలరు' అనే నినాదంతో దేశమంతా ఈ విధంగా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు. దాతలు ఎవరైనా ఆన్ లైన్ లో కూడా తమ విరాళాలు అందివ్వవచ్చుననీ, చెక్కులు, డీడీలను కూడా పంపించవచ్చునని ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ మైత్రి'తో పాటు ఈ కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు.