మన తెలుగు సినిమా వాళ్ళకు హీరోయిన్లు కరువు అన్న సంగతి తెలిసిందే... దీంతో బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ విలన్లకూ కొరతేనా? అంటే ప్రతి వాడూ హీరోకు ట్రై చేయడం వల్లా...? బాలీవుడ్ వాళ్ళు తప్ప విలనీకి పనికి రారా? కారణం ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది బాలీవుడ్ విలన్లే ఉన్నారు. సోనూ సూద్, రాహుదేవ్, ప్రదీప్ రావత్, మురళీ, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, కబీర్ దేహాన్ సింగ్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వారే.
గత రెండు దశాబ్దాల్లో లెక్కలేనంత మంది బాలీవుడ్ విలన్లు టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. కొందరు విజయవంతమయితే, కొందరు వెనక్కు వెళ్ళిపోయారు. హీరోయిన్లు పాతయినట్టే, వీళ్ళను కూడా కొన్ని సినిమాలకే పరిమితం చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు మన డైరెక్టర్లు బాలీవుడ్ వైపు ఓ లుక్కేస్తుంటారు. ఇప్పుడు మరో కొత్త విలన్ క్రిష్ కంట్లో పడ్డాడు. అతనే నికితిన్ ధీర్. వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు నికితిన్. ట్రైలర్ తో అతను జనాల కళ్ళలో పడ్డాడు. ఇతను చిత్రంలో హైలెట్ అయ్యే ఛాన్స్ ట్రైలర్ చూస్తేనే అర్థమై పోయింది. ఈ సినిమా హిట్టయితే నికితిన్ కు గిరాకీ బాగానే పెరిగిపోతుంది. ఇక నికితిన్ గురించి చెప్పాలంటే అతను పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడి కొడుకు. హృతిక్ రోషన్ సినిమా ‘జోధా అక్బర్’తో పరిచయమయ్యాడు. ఆ తర్వాత మిషన్ ఇస్తాంబుల్, రెడీ దబాంగ్-2, చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించాడు. క్రిష్ తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ కూడా చేశాడు. అందుకే క్రిష్ మళ్ళీ కాంచెలోకి లాక్కొచ్చాడు. ఇన్ని సినిమాలు చేసిన నికితిన్ టాలీవుడ్ లో క్లిక్ అవడం ఖాయం.