సై సినిమాతో మొదలైంది. కెమెరామెన్ సెంథిల్ ప్రయాణం దర్శకధీరుడు రాజమౌళితో. ఇక వరుసగా ఆయన ప్రాజెక్టులు మొదలవడం... సెంథిల్ ఆయనకు కెమెరామెన్ గా పని చేయడంతో ఇన్నేళ్ళూ గడిచిపోయాయి. సెంథిల్ కు దర్శకుడిని కావాలనే కోరిక బలంగా ఉందట. ఎప్పుడెప్పుడు దర్శకుడిని అయిపోదామా అని తెగ ఆరాటపడిపోతున్నాడట. కానీ తాను దర్శకుడిని కాకుండా రాజమౌళే అడ్డుకుంటున్నాడని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెంథిల్ చెప్పుకొచ్చాడు. ‘‘దర్శకత్వం చేయాలనేది నా కళ. అయితే రాజమౌళి ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలు చెబుతూ... నేను కెమేరాకు అంకితమయ్యేలా చేస్తున్నాడు. దీంతో నా దర్శకుడినవ్వాలన్న కోరిక మరుగున పడిపోతుంది. ఈ కథ బాగుంది...ఇదొక్కటే చేసి పక్కకు తప్పుకుందాం... అనుకుంటూ... ఇలా ఆయన సినిమాలన్నీ చేస్తూ... కెమెరామెన్ గానే ఉండిపోయా. ఇక బాహుబలి 2 తరువాత ఖచ్చితంగా మెగా ఫోన్ పట్టుకుంటా’’ అంటున్నాడు. బాహుబలి ప్రయాణం తన జీవితాంతం గుర్తిండిపోతుందంటున్నాడు సెంథిల్. ఈ సినిమా కోసం పడిన కష్టం ఎంతో ప్రత్యేకమైనది ఆయన వివరించాడు. భారీ సెట్టింగులతో పాటు, ఆయా పాత్రల భావోద్వేగాల్ని కేప్చర్ చేయడం ఓ సవాల్గా భావించి పని చేశానని సెంథిల్ చెప్పుకొచ్చాడు.