ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా... ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ... అవును మీరు చూసే వుంటారు. అల్లు అర్జున్, మనోజ్ నటించిన వేదం సినిమాలో ‘పద్మా.... మన డబ్బు దొరికిందే...’ అంటూ దీనంగా అరిచే ఓ పేద వాడు.
అప్పుకింద మనవడిని ఊడిగం చేయించుకుంటుంటాడు ఊరి పెద్ద. మనవడిని అతన్నించి విడిపించుకోడానికి కోడలి కిడ్నీని అమ్ముతాడు. ఆ డబ్బు ఎవరో (అర్జున్) దొంగిలిస్తే... ఆ పేద వాడి బాధ ఎలా ఉంటుంది ఆ ఉదాత్తమైన పాత్రలో నటించాడు ఫొటోలోని ఈ నాగయ్య.... వేదంలో ఈయన పాత్రను చూసినవారెవరైనా చలించి పోతారు. ఈ సినిమా పూర్తయ్యాక కడు పేదరికంలో మగ్గుతున్న నాగయ్యకు దర్శకుడు క్రిష్ ఆర్థిక సహాయం అందించాడట కూడా.
మరి ఈ నాగయ్య ఇప్పుడేం చేస్తున్నాడు? ఫిల్మ్ సిటీ రోడ్ల మీద అడుక్కుంటున్నాడట. నిన్న ఈయన ఫొటోను ఆ దీన స్థితిని ట్విట్టర్ లో చూసిన నెటిజన్లు చాలా ఆశ్చర్యపోయారు. నాగయ్య వేదం తరువాత ఓ రెండు సినిమాలు చేసినా అవి పెద్దగా గుర్తింపు తేలేనివి. ఇక చేసేది లేక అడుక్కోడం మొదలు పెట్టాడట. ఈ మధ్యే ఎన్నికల్లో గెలుపొందిన మూవీ అసోసియేషన్ ఇలాంటి పేద కళాకారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఏదైనా సహాయం అందించాలని కోరుకుందాం.