ప్రముఖ కన్నడ నటి, నాని సరసన తెలుగులో జెండాపై కపిరాజు సినిమాలో మెరిసిన నటి రాగిణి ద్విదేదిపై పోలీస్ కేసు నమోదయ్యింది. బెంగళూరు పరిధిలోని జేపీ నగర్ పోలీసు స్టేషన్ లో ఈ హాట్ నటిపై కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 'నాటికోలి' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకటేష్ అనే నిర్మాత ఆమెపై ఫిర్యాదు చేశారు. తన చిత్రంలో నటించేందుకు రాగిణితో ఒప్పందం కుదుర్చుకుని, ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్ కు రూ. 17 లక్షలు చెల్లించాడు. కొంచెం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల సినిమా నిర్మాణం ఆగిపోగా, దీంతో ఆమె ఇంతవరకూ ఆ డబ్బు తిరిగి చెల్లించలేదట.
దీంతో ఎన్నిసార్లు సంప్రదించినప్పటికీ వారి నుంచి సరైన స్పందన లేదని ఆ నిర్మాత చెబుతున్నాడు. పైగా డబ్బు తిరిగిచ్చే ప్రసక్తే లేదని కావాలంటే వేరే చిత్రంలో నటిస్తానని ఆమె నిర్మాతతో చెప్పిందట. దీంతో నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. వెంకటేష్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. గతంలో ఓ చిత్ర షూటింగ్ టైంలో రాగిణి తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమస్యతోనే ఈ సినిమా ఆగిపోయిందని డబ్బులు తిరిగిచ్చేందుకు తమ తరపున ఎలాంటి ఇబ్బంది లేదని రాగిణి ఓ మీడియా చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. మరో వైపు ఈ చిత్రం లో వల్గారిటీ మరి ఎక్కువగా ఉండటంతోనే రాగిణి ఈ చిత్రం నుంచి తప్పుకుందని కన్నడ మీడియా అప్పట్లో వార్తలు రాశాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సినీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలే తప్ప పోలీసుల దాకా వెళ్లటం ఏంటని ఆమె సోదరుడు మీడియాతో వ్యాఖ్యానించటం ఇక్కడ కొసమెరుపు.