ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చేవి. అవి కూడా టాప్ స్టార్లు ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎన్నో ఉండేవి. ఇప్పుడలా చేయకపోవడానికి కారణం మొదటి మాత్రం రెమ్యునరేషన్ సినిమా మొత్తం బడ్జెట్ హీరో రెమ్యునరేషన్ పావు వంతు ఉంటుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో... కానీ అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వర్రావు, కృష్ణ, శోభన్ ఇలా హీరోలంతా రెమ్యునరేషన్ వాళ్ళకు వాళ్ళే ఇంత తీసుకుందాం అని ఫిక్స్ చేసుకునే వారట. ఇప్పుడు అది లేకపోవడం వల్ల అందులో ఒక్క హీరోకే అంత రెమ్యునరేషన్ ఇచ్చుకుంటే ఒకే సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలను పెట్టి సినిమా తీయడమనే సాహసం నిర్మాతలు చేయలేకపోతున్నారు. ఇక సినిమాలు థియేటర్లలో ఆడడమంటే ఒకప్పటిలా లేదు పరిస్థితి, దీనికి తోడు పైరసీ రక్కసి పట్టి పీడుస్తుండడంతో... నిర్మాతలకు గడ్డు కాలం ఏర్పడింది.
ఇక హీరోలను కూడా అప్పటి డైరెక్టర్లు బ్యాలెన్స్ చేస్తూ నటింప చేసే వాళ్ళు, ఫాన్స్ తో ఇబ్బంది లేకుండా. హీరోలు కూడా ఈగోస్ లోపల ఉన్నా... అవి రచ్చకెక్కేంతలా ఉండేవి కావు. ఇప్పుడు కొన్ని సినిమా ఫంక్షన్ ల గమనిస్తే... పెద్ద పెద్ద స్టార్లకు ఒకరికొకరికి గిట్టడం లేదన్నది స్పష్టంగా అర్థమై పోతుంది. అప్పట్లో డైరెక్టర్లకు చాలా విలువుండేది... కథ, స్క్రీన్ ప్లే, మిగతా అన్నిట్లోనూ ఫైనల్ డెషిషన్ సినిమా డైరెక్టర్ దే... ఇప్పుడు హీరోలే డైరెక్టర్లను డామినేట్ చేస్తున్నారు...
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు స్టార్ కుటుంబాలు సినిమా ఫీల్డును ఏలేస్తున్నాయి. కుటుంబం అంతా ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఆడియన్స్ తెగ ఉత్సాహ పడిపోతారు... మంచువారు, అక్కినేని వారు అలా రెండు సినిమాలు తీసి చూపించారు. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి మనమూ తీస్తే బాగుంటుందని స్టార్ కుటుంబాలకు ఆలోచన వచ్చేస్తోంది.
ఇప్పుడు ముఖ్యంగా నందమూరి, ఘట్టమనేని ఫామిలీల తరువాత కొణిజేటి వారు కూడా మల్టీ స్టారర్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే రాం చరణ్ కథ దొరికితే బాబాయ్, నాన్నలతో కలిసి చేస్తానని అంటున్నాడు. ఇలా ఫామిలీలు అనుకుని చేస్తే రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులుండకపోవచ్చు... సినిమా రిలీజ్ తరువాత పర్సంటేజ్ లు, ఏరియాలు అనుకుంటే... నిర్మాతలకూ పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఫామిలీ మల్టీ స్టారర్ అన్న మాట... ఇదొక కొత్త ట్రెండ్.
మెగా ఫామిలీ అంటే నాన్న, బాబాయ్ మాత్రమేనా... ఇప్పటికే రంగంలోకి దిగిన సాయిధరమ్, వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. ఇంకో బాబాయ్ నాగబాబు ఉన్నారు... కొత్తగా చెల్లి కూడా ఎంటరైంది. కేవలం చిరు, పవన్ ల క్రేజ్ మాత్రమే చాలనుకుంటే ఎలా చెర్రీ బాబూ!