టాలీవుడ్ చరిత్రలో 2017 సంక్రాంతి గట్టి పోటీకి సిద్ధమైపోతుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇద్దరు అగ్రహీరోలు వారి వారి చిత్రాలను మొదలుపెట్టేశారు. షూటింగ్ లు ఇంకా ప్రారంభం కానప్పటికీ కొబ్బరికాయ కొట్టేయడంతో ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. ఎలాగైనా సంక్రాంతికల్లా చిత్రాలను పూర్తి చేసి బరిలో దిగాలని వారు అనుకుంటున్నారంట. బాలకృష్ణ కథానాయకుడిగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భారీ చారిత్రక చిత్రం కావడంతో, ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక వైపున ఈ సినిమాకి బాణీలు కట్టడంలో దేవిశ్రీ ప్రసాద్ నిమగ్నమై వుంటే, మరో వైపున దర్శకుడు క్రిష్ మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవడంలో బిజీగా వున్నాడు. మే 9 నుంచి 'మొరాకో'లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి క్రిష్ వచ్చాడట. ఇక చిరంజీవి 150 వ సినిమా కూడా సంక్రాంతికి రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వినాయక్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెగా వర్సెస్ నందమూరి వార్ తో సంక్రాంతికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది.