యువతరం ఎప్పటికప్పుడు ఏదో ఒక సాహసం చేయాలని ఆశిస్తుంటుంది. అలా సాహసాలు చేసిన వారిలో ఎంతోమంది విజయం సాధిస్తే మరికొంతమంది అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అలా 2010లో జరిగిన సాహసాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ మరియు శ్రీ శేలేంద్ర ప్రొడక్షన్స్. ఆరుగురు స్నేహితులు సరదాగా ట్రెక్కింగ్ కోసం మంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలోని అడవికి వెళ్లారు. తరువాత వారు కనిపించలేదు. వారితోపాటు తీసుకువెళ్లిన కెమెరా 2012లో దొరికింది. కెమెరా విజువల్స్‌లో వారు కనపడకుండా పోవడానికి కారణాలేంటో ఉన్నాయి. అవే విజువల్స్ ను సినిమా రూపంలో ఎడిటింగ్ చేసి ప్రేక్షకులకు ‘చిత్రమ్ కాదు నిజమ్’ (ఎ ట్రూ పుటేజ్ ఫిలిమ్) పేరిట అందిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. డిసెంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రంలో అన్నీ నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలే ఉంటాయి. అటవీశాఖ అనుమతితో చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.