ఈ మధ్య జరిగిన ఫెడరేషన్ కార్మికుల సమ్మె, దాని పర్యవసానాలపై మూవీ ఆర్టస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ ప్రస్థుతం సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కారణాలను ఆయన విశ్లేషణాత్మకంగా వివరించారు. దీనికంతటికీ మూల కారణం హీరోల రెమ్యునరేషన్లేనని అంటున్నారు. దీంతో ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్న నిర్మాతలకు గడ్డుకాలం ఎదురవుతున్నదని వివరించారు. గతంలో ఒక పద్ధతి ప్రకారం రెమ్యునరేషన్ల వ్యవహారం నడిచేదనీ, ఎన్టీఆర్, ఎఎన్నార్ రాజ్యమేలుతున్న కాలంలో పరిశ్రమ బాగుకోసం తమ రెమ్యునరేషన్ ల మీద తామే నియంత్రణ ఏర్పరచుకన్నారన్నారు. ఇద్దరు కలిసి సినిమాకు యాభై వేలు మించకుండా తీసుకునేవారని అన్నారు. నిర్మాతలు లక్షలు ఇచ్చే స్థితిలో ఉన్నా ఈ పరిమితికి కట్టుబడి ఉన్నారనీ, ఇది నిర్మాతలకు చాలా వెసులుబాటుగా ఉందని అన్నారు. పెద్ద హీరోలు ఇలా పరిమితి విధించుకోవడం వల్ల ఆ తరువాతి ఆర్టిస్టులు ఆ స్థాయిలోనే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు దీనికి విరుద్ధంగా జరుగుతుందన్నారు. ఫెడరేషన్ సమ్మెకు సంబంధించి మాత్రం ఇరు వర్గాల వాదన కూడా సమంజసమే నన్నారు. కార్మికుల వేతనాలు పెంచడం సబబే, నిర్మాతలు ప్రస్థుతం సినిమాలు తీయలేని స్థితిలో ఉన్నారనేది కూడా నిజమేనంటున్నారు. సినిమాకు 20 కోట్ల లాభం వస్తే, అందులో రెండు కోట్లు హీరోకు అని నిర్ణయించుకోవాలని, లాభాలతో పనిలేకుండా, తమ పదికోట్లు తమకే అనుకుంటే సినిమా పరిశ్రమ నాశనమై పోతుందన్నారు. దీనికి పరిష్కారం అందరు హీరోలు కలిసి పరిమితి విధుంచుకోవాలని, లేకపోతే సినిమా పరిశ్రమకు గడ్డుకాలం తప్పదన్నారు. ఇప్పటి పరిస్థితిలో ఇది సాధ్యం కాదని కూడా తిరిగి ఆయనే అంటున్నాడు. బడా సినిమాలు బొల్తా పడుతున్న వేళ నష్టాల నుంచి బయట పడేందుకు ఇటీవలి నిర్మాతల మండలి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఇందులో ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినట్లయితే హీరోలు, దర్శకులు తీసుకున్న రెమ్యునరేషన్ కొంత తిరిగి రాబట్టుకునే వెలుసుబాటు ఉంది. కానీ ఇది ఇంకా అమలులోకి రాలేదు. తెలివైన మన హీరోలు కొందరు మరింత తెలివిగా, కొన్ని ఏరియాల రైట్స్ ను తమ పారితోషకంగా నిర్ణయించుకుంటున్నారు. దీని వల్ల కూడా ఆ హీరో లాభపడతాడే తప్ప నిర్మాతలకు కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు.