కేవలం తమిళంలోనే కాదు, తెలుగు, హిందీ... పలు భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు బాలచందర్. తమిళనాడులోని తంజావూరు (తిరువారూరు)జిల్లా నన్నిలం గ్రామంలో 1930 జూలై 9న కైలాసం బాలచందర్ జన్మించారు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే సినిమాపై ఎనలేని మక్కువను పెంచుకున్న ఆయన 12 ఏళ్ల వయసులో రంగస్థలంపై అడుగుమోపారు. చదువులో పట్టభద్రుడైన తర్వాత బాలచందర్ రంగస్థలం నుంచి సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1965లో తొలిసారిగా మెగాఫోన్ పట్టి ‘నీర్ కుమిజి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివంగత హాస్యనటుడు గణేష్ కథా నాయకుడిగా నటించారు. వరుసగా మేజర్ చంద్రకాంత్, ఇరుకొడుగళ్, పూవా తలైవా, భామా విజయం, తామరై నెంజం, నాన్ అవనిల్లై, పున్నగై, సింధుభైరవి, అపూర్వ రాగంగళ్, తన్నీర్ తన్నీర్ ఇలా పలు చిత్రాలను తెరకెక్కించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. తెలుగులో సత్తెకాలపు సత్తయ్య, సుఖదుఖాలు, అంతులేని కథ, మరోచరిత్ర, ఆకలిరాజ్యం,కోకిలమ్మ, అందమైన అనుభవం, రుద్రవీణ లాంటి ఆణిముత్యాలను అందించారు. చిత్రాలతోపాటు అన్ని భాషల్లో కలిపి దాదాపు పదిహేడు సీరియల్స్ కు కూడా ఆయన దర్వకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం దివంగత తెలుగు నటుడు ఉదయకిరణ్ తో పోయ్ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం తెలుగులో అబద్ధం అనే పేరుతో డబ్ అయ్యింది.నేటి సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌లతో పాటుగా 50 మందికి పైగా నటీ నటుల్ని తెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్‌దే. కమలహాసన్, మాధవి తదితర నటుల్ని బాలీవుడ్‌కు పరిచయం చేసింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కెే అవార్డును అందజేసింది. ఆయన మృతి యావత్ భారత సీనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో పడేసింది. ఆయన మరణ సమాచారంతో అభిమానులు కన్నీటి మడుగులో మునిగారు. అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా వచ్చి చేరటంతో భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలో సందర్శనార్థం ఉంచారు.