సినిమా పరిశ్రమకు ఎందరో వస్తుంటారు వెళుతుంటారు. కొందరు కొన్నాళ్లు కనిపించి కనుమరుగవుతుంటారు. అలా నిర్మాతలూ, దర్శకులూ, నటులూ ఎందరో ఉంటుంటారు. ఏ కొందరికో వారి అనుబంధం సినిమాతోనే ముడిపడి ఉంటుంది. అలా సినిమాతో అనుబంధం పెనువేసుకున్నారు కాబట్టే ఆయనను మూవీ మొఘల్ అని గర్వంగా పిలుచుకుంటున్నాం. ఆయన ఇక లేరు అని చెప్పుకుంటున్నాం గానీ, ఆయన సినిమాకు అందించిన ఆణిముత్యాలెన్నో పరిశ్రమ ఉన్నంత కాలం కనిపిస్తూనే ఉంటారు.అందులోనే ఆయనా కనిపిస్తారు. బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటివద్దే సందర్శనకు ఉంచి, గురువారం అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి రామానాయుడు స్టూడియోకు చేరుకుంది. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం గురువారం మధ్యాహ్నం వరకు రామానాయుడు స్టూడియోలో ఉంచారు. అధికారిక లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్లు నరసింహన్, కె.రోశయ్య, సీహెచ్. విద్యాసాగరరావుతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామానాయుడు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లు, రికార్డింగ్‌లతోపాటు అన్ని విభాగాలు, థియేటర్లు, మల్టీప్లెక్సులు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. సందర్శనకు వచ్చిన పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మీడియాతో పంచుకున్నారు. నటి రాజశ్రీ మాట్లాడుతూ...నాయుడుగారు నిర్మించిన సినిమాల్లో నేను హీరోయిన్‌గా చేసింది ఒక్క 'ప్రతిజ్ఞాపాలన'లోనే. 'స్త్రీజన్మ' లో ఒక పాటలో నటించాను. ఆయన బ్యానర్‌లో ఒక సినిమా చేసినా పది సినిమాలు చేసినంత. ఆయనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేం దాదాపు ఒకే ఈడువాళ్లం. నా సినిమాలు, ఆయన సినిమాలు ఒకే స్టూడియోలో పక్కపక్క సెట్లలోనే జరుగుతుండేవి. ఆయన ఎక్కడున్నా వాళ్ల ఇంటి నుంచి భోజనం వచ్చేది. నాకు బాగా గుర్తు వాహిని స్టూడియోలో ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉండేది. భోజన సమయంలో ఆర్టిస్టులందరూ తమ క్యారేజీలు అక్కడకు తేవాల్సిందే. నాయుడుగారి ఇంటి నుంచి వచ్చిన భోజనం మేం తినేస్తే ఆయన మా భోజనం పంచుకు తినేవారు. తాను ఓ గొప్ప నిర్మాత అనే గర్వం ఏమాత్రం కనిపించకుండా అందరితోనూ కలిసిపోయేవారన్నారు. నన్ను ఎప్పుడూ 'మా పిక్చర్‌లో నటిస్తావా' అంటూ అడుగుతుండేవారు. హైదరాబాద్‌లో నా వివాహం జరిగినప్పుడు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు తీరిక చేసుకుని వచ్చి వెళ్లారు. హైదరాబాద్‌లో ఆ మధ్య ఏఎన్‌ఆర్‌గారు నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు చివరిసారిగా రామానాయుడుగారిని కలిశాను. చాలా సహాయగుణం ఉన్న వ్యక్తి. నేనూ, కాంతారావు, మరికొంతమంది ఆర్టిస్టులం కలిసి సేలంలో షూటింగ్‌కని రైళ్లో వెళుతున్నప్పుడు పై బెర్తులో నిద్రించడం వల్ల కాబోలు నాకు వెన్నులో నొప్పిగా అనిపించింది. నాయుడుగారు వెంటనే నన్ను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించి నా ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలను ఆయన ఒక యజ్ఞంలా తీస్తారు. అలాంటి మంచి మనిషి మరణ వార్త వినాల్సి రావడం నాకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. కాంచన మాట్లాడుతూ... ఎందుకనో తెలియదు కానీ నాకు నాయుడిగారితో అన్నేళ్ల పరిచయం ఉన్నా నేను ఆయన సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం లభించలేదు. 'న్యూఢిల్లీ' సినిమాలో నన్ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు, కానీ అది మాటలవరకే ఆగిపోయింది. శ్రీకృష్ణతులాభారం సినిమాలోనూ కృష్ణుడి అష్ట భార్యల్లో ఒకరిగా నా చేత చేయించాలనుకున్నారు. అది కూడా కుదరలేదు. అయితే ఆయన సినిమా 'సెక్రటరీ'లో అక్కినేని సరసన అతిథి పాత్రలో నటించాను. అలా రామానాయుడు బ్యానర్‌లో నటించే అవకాశం కలిగింది. ఆయన సినిమాల్లో నటించకపోయినా ఆ ఫీలింగ్ మనకు ఉండదు. తన సినిమాలో నటించారా లేదా అనేది ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఒక వ్యక్తి ఇన్నేళ్లు, ఇన్ని సినిమాలు తీయాలంటే అయ్యేపని కాదు. ఒక నాగిరెడ్డి, జెమినీ వాసన్, ఏవీఎం వారికో అది సాధ్యమవుతుంది, కారణం అవి సంస్థలు, కానీ నాయుడుగారు ఒక వ్యక్తిగా నడక ఆరంభించి, సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ఇంత స్థాయికి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఆయన సినిమాకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా సరే 'ఏమండీ కాంచనగారు మీరు తప్పకుండా రావాలి' అని పిలిచేవారు. ఒక మంచి మనిషి, ఒక మంచి నిర్మాత. ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు. శారద మాట్లాడుతూ... ప్రయోగాలకు పెద్ద పీట వేసే నిర్మాత ఎవరంటే నాయుడుగారి పేరే ముందు చెబుతాను. ఎందుకంటే ఆయన రూపొందించిన సినిమాలన్నీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్లుగానే మిగిలాయి. 'ప్రతిధ్వని'లో నా చేత పోలీసు అధికారి వేషం వేయించారు. పోలీసు ప్యాంటు, చొక్కాలతో ఉన్న నన్ను చూసి చాలా మంది 'నాయుడుగారు ఇలా వర్కవుట్ అవుతుందా? ఈ అమ్మాయిని జనం చూస్తారా?' అని రామానాయుడిని అడిగారు. 'చూస్తారా కాదు హిట్ చేస్తారు కూడా' అని నాయుడుగారు సమాధానమిచ్చేవారు. నిజంగానే ఆ సినిమా పెద్ద హిట్. ఒక సినిమాపైన, దాని కథా బలంపైన ఆయనకున్న నమ్మకం అలాంటిది. ఒక సినిమా ప్రారంభమైందంటే పూర్తయ్యేంత వరకూ నిద్రపోరు. సెట్స్ లో ఆయన ఒక నిర్మాతగా మనకు కనిపించరు. అన్ని పనులూ చేస్తారు. అలాంటి మంచి మనిషి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన గుండెల్లో నిత్యం జీవించే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ...రామానాయుడిని తెలుగు నిర్మాత అంటే నేను అంగీకరించలేను. ఆయన జాతీయ నిర్మాత. అప్పట్లో నాకు తెలిసి ఏ నిర్మాత కూడా దేశంలోని పలు భాషల్లో సినిమాలు నిర్మించినవారు లేరు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఈ దిశగా సినిమాలు రూపొందిస్తున్నా అప్పట్లో మాత్రం నాయుడుగారే. ఒక నిర్మాత అంటే సినిమామీద డబ్బులు ఖర్చు చేసి, చివర్లో ఇంటికి కొంత లాభం మూట కట్టుకుపోయేవాడని అనుకుంటుంటాం. కానీ నిర్మాత అంటే ఎలా ఉండాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలి. సినిమా స్క్రిప్ట్ లో ఆయనకు ప్రతి లైనూ, డైలాగూ కంఠోపాఠం.నన్ను 'హీరో'గారు అని ఆత్మీయంగా పిలిచేవారు. 'ఇంద్రుడు చంద్రుడు' సినిమా తీస్తున్నప్పుడు 'ఏం హీరో గారూ ఫలానా సీన్ అయిపోయిందా, ఆ డైలాగ్ బాగా వచ్చిందా' అంటూ అడిగేవారు. ఆయనకు అంత అనుభవం ఎలా వచ్చిందీ అంటే బహుశా ఆయన ప్రారంభంలో పనిచేసిన పెద్దపెద్ద సంస్థలు విజయా వాహినీల నుంచే అనుకుంటాను. ఆయనో లెజెండ్. ఆయన కుటుంబంతో నాకు అత్యంత ఆత్మీయానుబంధం ఉంది. వారి అబ్బాయిలతో కలిసి పనిచేశాను. ఆయన ఎంతోమందికి ఒక హీరో లాంటివారు అన్నారు. ఇలా ఆయనతో అనుబంధం ఉన్న పలువురు వారి ఙ్ఞాపకాలను పంచుకున్నారు.