ప్రముఖ నిర్మాత, జగపతి ఆర్ట్స్ అధినేత వీబీ రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్ లోని ఇషా ఆస్పత్రిలో చికిత్సపొందుతు మృతిచెందారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ఈయన తనయుడే. 1932 నవంబర్ 4న క్రుష్ణా జిల్లాలో జన్మించిన రాజేంద్రప్రసాద్ చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించారే వారు. తోలుత హీరో అవుదామని మద్రాస్ కు వెళ్లారు. ఆయితే ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవటంతో సన్నిహితుల సలహామేరకు క్రమంగా నిర్మాణంపై దృష్టిసారించారు. అన్నపూర్ణ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అనంతికాలంలోనే మేటి నిర్మాతల్లో ఒకరిగా పేరొందారు. జగపతి ఆర్ట్స్ బ్యానర్ పై అన్నపూర్ణ, ఆరాధన, అంతస్తులు, అక్కాచెల్లెలు, ఆత్మబలం, దసరాబుల్లోడు, కిల్లర్, రామకృష్ణులు వంటి పలుహిట్ చిత్రాలు నిర్మించారు. కాగా, దసరా బుల్లోడు చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన తనయుడు జగపతిబాబును కూడా ఆయనే తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన ఎక్కువ చిత్రాలు అక్కినేని నాగేశ్వరావుతో నిర్మించినవే. గత కొన్నేళ్లుగా ఫిలింనగర్ దైవ సన్నిధి ట్రస్టీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘మా నాన్న ఎవరీని కష్టపెట్టలేదు. ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు’ అని నటుడు జగపతిబాబు తెలిపారు. ఆయన భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఇంట్లోనే ఉంచుతున్నట్లు తెలిపాడు. కాగా, వీబీ మృతిపట్ల తెలుగు సినీపరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది.